డీఎస్సీ నియామకాలపై చంద్రబాబు కీలక ప్రకటన, ఇక నుంచి..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేసారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అమలు చేస్తున్న పథకాలు.. సంక్షేమం.. అభివృద్ది గురించి వివరించారు. సుపరిపాలనకు పోటీ లేదని చెప్పుకొచ్చారు. ఇది ఆల్ టైం రికార్డుగా పేర్కొన్నారు. అదే విధంగా గత ప్రభుత్వంలో జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తూ.. ఒక్కో రంగంలో ముందుకు వెళ్తున్నామని వివరించారు. పేదలకు మంచి చేసేందుకు వెనుకాడమని స్పష్టం చేసారు. 100 గజాల్లోపు స్థలాల్లో ఎటువంటి బిల్డింగ్ ప్లాన్ లేకుండానే ఇంటిని నిర్మించుకోవచ్చని వెల్లడించారు.
సూపర్ హిట్ చేసాం
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయజెండాను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు కీలక ప్రసంగం చేసారు. ప్రధాన ఎన్నికల హామీలుగా ఉన్న సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేశామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా, భవిష్యత్‌కు బాటలు వేసేలా తొలి రోజు నుంచి పనిచేస్తున్నామని వెల్లడించారు. పేదల సేవలో' కార్యక్రమంలో 64 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇంటి వద్దే పంపిణీ చేస్తూ సంక్షేమ రాజ్యానికి కొత్త అర్థాన్ని ఇచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తన బిడ్డ చదువుకోవాలని కలలుకనే పేదింటి తల్లులకు ఆర్ధిక భరోసా ఇచ్చేందుకు 'తల్లికి వందనం' పథకాన్ని రూ. 10వేల కోట్లతో అమలు చేస్తున్నామని ప్రకటించారు. అన్నదాత సుఖీభవ పథకంలో మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేలు, కేంద్రం రూ.2 వేలు కలిపి మొత్తం రూ.7 వేలు రైతుల ఖాతాల్లో వేశామని చెప్పారు.

మేలు చేసాం
ఈ పథకం ద్వారా 47 లక్షల మంది రైతులకు రూ.3,173 కోట్లు మేర అందించామన్నారు. దీపం పథకం కింద ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తూ, ఏటా రూ.2,684 కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు. ఇప్పటి వరకూ 2 కోట్ల రాయితీ సిలిండర్లు ఇచ్చామని తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు 'స్త్రీ శక్తి' పేరుతో ఉచిత ప్రయాణాన్ని కానుకగా ఇస్తున్నామన్నారు. 16,347 పోస్టులతో నిర్వహించిన మెగా డీఎస్సీ నియామకాలను ఈ నెలాఖరకు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. మేనిఫెస్టోలో చెప్పినట్లు కల్లు గీత కార్మికులకు 10 శాతం మద్యం దుకాణాలు, బార్‌లు కేటాయించామని చంద్రబాబు వెల్లడించారు.
మత్స్యకారులకు వేట విరామ సమయంలో రూ.20 వేలు ఆర్ధిక సాయాన్ని ఇస్తూ, మత్స్యకారుల సేవలో పథకం ద్వారా 1,29,178 మందికి రూ.259 కోట్లు అందించామన్నారు.
కీలక ప్రకటన
చేనేతకు అండగా హ్యాండ్లూమ్స్‌కు నెలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్స్‌కు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని వివరించారు. ఎస్సీ సామాజిక వర్గాల్లో అంతరాలు తగ్గించేలా ఏ వర్గాన్ని నొప్పించకుండా, ఏ ఒక్కరూ నష్టపోకుండా ఎస్సీ వర్గీకరణతో వారి దశాబ్దాల ఆకాంక్ష నెరవేర్చామని స్పష్టం చేశారు. ఏపీ బ్రాండ్‌ను పునరుద్ధరించటమే కూటమి ప్రభుత్వ ఆశయమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పారిశ్రామికవేత్తలకు నమ్మకాన్ని కలిగించి తిరిగి రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేలా కృషి చేస్తున్నామని వెల్లడించారు. 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటించారు. భవన నిర్మాణాలకు అనుమతులు సులభతరం చేసి, 100 గజాల్లోపు స్థలాల్లో ఎటువంటి బిల్డింగ్ ప్లాన్ లేకుండానే ఇంటిని నిర్మించుకునే అవకాశాన్ని కల్పించామని చంద్రబాబు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications