ఆదానీ వివాదం - జగన్ ఒప్పందాలపై చంద్రబాబు అనూహ్య నిర్ణయం..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. సంచలనం రేపిన ఆదానీ వ్యవహారంలో ఏపీలో జరిగిన ఒప్పందాల పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, రాజకీయంగా - పాలనా పరంగా ఎలాంటి ప్రభావం పడుతుందనే కోణంలో ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే అధికారుల నుంచి చంద్రబాబు ఈ అంశం పైన నివేదిక కోరారు. అదే విధంగా కాకినాడ పోర్టు విషయంలోనూ అనూహ్య నిర్ణయం ఉండే అవకాశం కనిపిస్తోంది.
నివేదిక ఆధారంగా
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన విద్యుత్ ఒప్పందాల పైన ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. తాజాగా ఆదానీ ముడుపుల వ్యవహారం తెర పైకి రావటంతో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దాని పైన తర్జన భర్జన పడుతోంది. ఇప్పటికే ఈ ఒప్పందం పైన పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. జగన్ హయాంలో చేసుకున్న ఒప్పందాల పైన ఏం చేయాలో అధ్యయనం చేస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. ఒకసారి కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేస్తే జరిమానా కట్టేలా చర్యలు ఉండాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అయితే, ప్రజల కోణంలో ఆలోచించి నిర్ణయం ఉంటుందని చెప్పారు.

ఫిర్యాదుల పై విచారణ
సాధారణ ప్రజల నుంచి పార్టీ కార్యాలయంలో చంద్రబాబు వినతులు స్వీకరించారు. మీడియాతో చంద్రబాబు నిర్వహించిన ఇష్టాగోష్టిలో అనేక అంశాలను వెల్లడించారు. ఉచిత ఇసుక విషయం లో వస్తున్న ఫిర్యాదులను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఉచిత ఇసుక బోర్డు పెట్టి ఎన్ని టన్నులైనా రవాణా చేసుకునేలా వెసులుబాటు కల్పించినట్లు వెల్లడించారు. కృష్ణాజిల్లా పామర్రు, పెనమలూరు నియోజకవర్గాల్లో రైతు భరోసా కేంద్రాల్లో అవకతవకల అంశం పైన ఫిర్యాదులు రావటంతో ముఖ్యమంత్రి నివేదిక కోరారు. అదే విధంగా రైతుల నుంచి ఎక్కువ ధాన్యం సేకరించి రికార్డుల్లో తక్కువ చూపిస్తూ కొందరు అధికారుల తీరు పైన ఫిర్యాదులు వచ్చాయి.
వారి తీరు మారాలి
అదే విధంగా రైతుల విషయంలో మిల్లర్లు సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు రావటంతో దీని పైన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయటానికి వాట్సప్ ద్వారా నమోదు పద్ధతి పెట్టామని గుర్తు చేసారు. కాకినాడ పోర్టు, సెజ్‌లలో బలవంతంగా వాటాలు రాయించుకున్న వ్యవహారం ల్యాండ్ గ్రాబింగ్ పరిధిలోకి వస్తుందేమో చూడాల్సి ఉందని సీఎం వ్యాఖ్యానించారు. భూముల అక్రమాల పైన పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. వీటిని పరిష్కరిస్తామని చెప్పారు. కొందరు అధికారుల తీరు పైన ఫిర్యాదులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అందరి ఫిర్యాదులు పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని సీఎం వెల్లడించారు.












Click it and Unblock the Notifications