రైతన్నకు భరోసా.. కృష్ణమ్మకు జల హారతి వేళ సీఎం ఏమన్నారంటే
రాష్ట్ర సాగునీటి రంగానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును వచ్చే 2027 మార్చి నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పోలవరం పూర్తయితే గ్రావిటీ ద్వారానే నేరుగా నీరు అందుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కృష్ణా-గోదావరి నదుల పవిత్ర సంగమ ప్రాంతమైన ఇబ్రహీంపట్నం వద్ద బుధవారం జరిగిన ప్రముఖ ఇంజనీర్ డాక్టర్ కేఎల్ రావు 124వ జయంతి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేఎల్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సభలో కేఎల్ రావు కుమారుడు కేఎల్ విజయరావుతో పాటు మంత్రులు నిమ్మల రామానాయుడు, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ.. సాగునీటి రంగానికి మహోన్నత సేవలు అందించిన కేఎల్ రావు స్ఫూర్తిని ప్రతీ గ్రామానికీ తీసుకెళ్లేలా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోందని చెప్పారు. "విజయవాడ గడ్డపై పుట్టి, ఎంపీగా గెలిచి.. ముగ్గురు ప్రధానుల వద్ద కేంద్రమంత్రిగా పనిచేసిన ఘనత కేఎల్ రావుది. శ్రీశైలం, నాగార్జున సాగర్, హీరాకుడ్, కోసీ లాంటి ప్రతిష్టాత్మక డ్యామ్‌ల నిర్మాణంలో ఆయన పాత్ర మరువలేనిది. ఐక్యరాజ్యసమితి తరపున అంతర్జాతీయ జల నిపుణుడిగా ఈజిప్ట్, సూడాన్ వంటి దేశాలకూ ఆయన సేవలందించారు. బ్రిటీష్ కాలంలో సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం బ్యారేజీ, కృష్ణా బ్యారేజీలు నిర్మిస్తే.. స్వతంత్ర భారతంలో వాటిని ఆధునీకరించి తెలుగు నేలను సస్యశ్యామలం చేసింది కేఎల్ రావు గారే. వారి తర్వాత ఎన్టీఆర్ సాగునీటి రంగాన్ని ఎంతగానో తీర్చిదిద్దారు. వీరంతా నాకు నిత్య స్ఫూర్తిప్రదాతలు" అని సీఎం కొనియాడారు.

పట్టిసీమ వల్లే రాయలసీమకు నీళ్లు.. కృష్ణా డెల్టా స్థిరీకరణ!
గతంలో పట్టిసీమ ప్రాజెక్టును కొందరు 'వట్టిసీమ' అంటూ అవహేళన చేశారని, ప్రాజెక్టు దండగ అన్నారని చంద్రబాబు గుర్తుచేశారు. "2014లో విభజన కష్టాల్లో ఉన్నప్పుడు బస్సులోనే బస చేసి, కృష్ణా డెల్టాను కాపాడటానికి పట్టిసీమ ప్రారంభించాం. 80 టీఎంసీల గోదావరి నీటిని తెచ్చి కృష్ణా డెల్టాను రక్షించాం. నీల వర్ణంలోని కృష్ణా జలాలు, అరుణ వర్ణంలోని గోదావరి జలాలు పవిత్ర సంగమంలో కలిసి ఈ ప్రాంతంలో బంగారం పండించాయి. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టా స్థిరీకరణ జరగడం వల్లే.. శ్రీశైలంలో నీటిని పొదుపు చేసుకుని, ఆ నీటిని రాయలసీమ ప్రాంతానికి తరలించే వీలు కలిగింది. 2015 నుంచి 2025 వరకు పట్టిసీమ ద్వారా 450 టీఎంసీల నీటిని తరలించాం. దీనికోసం మనం ఖర్చు పెట్టింది కేవలం రూ. 1300 కోట్లు మాత్రమే" అని లెక్కలతో వివరించారు.
గత పాలకుల నిర్లక్ష్యం 'రాష్ట్ర ద్రోహం'..
గత ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "గత పాలకులు అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయినా పట్టించుకోలేదు. గుండ్లకమ్మ, పులిచింతల గేట్లు కొట్టుకుపోయినా మాట్లాడలేదు. ప్రాజెక్టుల నిర్వహణకు కనీసం గ్రీజు పూయడానికి కూడా పైసా ఇవ్వలేదు. అత్యంత కీలకమైన ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం వహించడం దేశ ద్రోహం, రాష్ట్ర ద్రోహం కిందకే వస్తుంది. 2014-19 మధ్య పోలవరంలో 72 శాతం పనులు పూర్తి చేస్తే.. గత ఐదేళ్లలో కనీసం 2 శాతం పనులు కూడా చేయకుండా డయాఫ్రామ్ వాల్ దెబ్బతినేలా చేశారు. నేను నేరుగా 37 సార్లు పోలవరాన్ని సందర్శించి, 136 సార్లు సమీక్షించాను. ప్రస్తుతం ప్రాజెక్టు 89 శాతం మేర పూర్తయింది. నిర్వాసితులకు రూ. 2,250 కోట్లు చెల్లించాం" అని వివరించారు.
రూ. 35 వేల కోట్లతో.. వచ్చే మూడేళ్లలో 36 ప్రాజెక్టుల పూర్తి!
రాష్ట్రంలో నీటి వనరుల వినియోగం, ప్రాజెక్టుల భవిష్యత్తుపై సీఎం చంద్రబాబు పలు కీలక ప్రకటనలు చేశారు. ప్రాధాన్యతా క్రమంలో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వచ్చే మూడేళ్లలో రూ. 35 వేల కోట్లు ఖర్చు చేసి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
"తుంగభద్ర డ్యామ్‌కు కొత్త గేట్లు ఏర్పాటు చేయించాం. ధవళేశ్వరం బ్యారేజీకి కూడా రూ. 152 కోట్లతో కొత్త గేట్ల ఏర్పాటు పనులు ప్రారంభించాం. వచ్చే ఏడాదికి ఈ పనులు పూర్తవుతాయి. గుంటూరు ఛానల్ ఆధునీకరణకు ఈ నెలలోనే శంకుస్థాపన చేసి, రెండేళ్లలో పూర్తి చేస్తాం. పోలవరం ఎడమ కాలువ పూర్తయింది. ఆగస్టు 14వ తేదీన గోదావరి జలాలకు అనకాపల్లి వద్ద అఖండ హారతి ఇచ్చి ఘనంగా స్వాగతం పలుకుతాం. పేరూరు బ్రాంచ్ కెనాల్‌కు 2026 ఆగస్టు 4న శంకుస్థాపన చేస్తాం. గత పాలకులు సొరంగంలో టన్నెల్ బోరింగ్ మిషన్ ఇరుక్కుపోయినా ప్రాజెక్ట్ ప్రారంభమంటూ నాటకాలు ఆడారు. ఆ మోసాన్ని అధిగమించి వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను 2026 సెప్టెంబరు 1న జాతికి అంకితం చేస్తాం. ప్రతి వర్షపు చుక్కనూ భూగర్భ జలంగా మార్చేందుకు 'జలధార' కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాం. గత ప్రభుత్వం నిలిపివేసిన పవిత్ర సంగమ హారతిని తిరిగి పునరుద్ధరిస్తామని" సీఎం చంద్రబాబు తెలియజేశారు
నదుల అనుసంధానమే భారత ప్రగతికి అసలైన సోపానమని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. గంగా-కావేరి నదుల అనుసంధానం జరిగితే దేశ రూపురేఖలే మారిపోతాయని, రాష్ట్రంలో వంశధార నుంచి పెన్నా వరకు నదులను అనుసంధానించాలన్నదే తన లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications