48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెర్షన్ మార్చారు. తన మన భేదం లేకుండా సీరియస్ యాక్షన్ షురూ చేస్తున్నారు. ఈ క్రమంలోనే 48 మంది ఎమ్మెల్యేలకు బిగ్ షాక్ ఇచ్చారు. ప్రజలకు నేరుగా చేరే పెన్షన్లు, సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాల విషయంలో అలసత్వం వహించిన ప్రజాప్రతినిధులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు చేరువయ్యే ప్రతి సంక్షేమ కార్యక్రమం పార్టీ ప్రతిష్టకూ, ప్రభుత్వ విశ్వసనీయతకూ సంబంధించినదని అన్నారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనని 48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఈ మేరకు పార్టీ కార్యాలయంలో జరిగిన టీడీపీ సిబ్బంది, ముఖ్య నేతలతో సమీక్షా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల ద్వారా ప్రజల మనసులు గెలుచుకోవాల్సిన సమయం ఇది అని.. పార్టీకి కష్టపడి పనిచేసిన కార్యకర్తలు ఉన్నారని అన్నారు. అందరినీ కలుపుకొని ప్రజాపతినిధులు గ్రామ స్థాయిలోకి వెళ్లాలని.. ఎక్కడా నిర్లక్ష్యం కనిపించినా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసినట్టు సమాచారం.

అలాగే పథకాల అమలులో లోపాలు, ఆలస్యం వంటి అంశాలను మానిటర్ చేయడానికి ప్రత్యేక సమీక్షా బృందాలను ఏర్పాటు చేయాలని కూడా ఆయన సూచించారు. పేదలకు, వృద్ధులకు, వికలాంగులకు న్యాయం జరుగుతోందా లేదా అనే అంశంపై అధికారులు నిరంతరం ఫోకస్ పెట్టాలని ఆదేశించారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వానికి ప్రాణమని.. మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ బాధ్యతను సీరియస్‌గా తీసుకోవాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం ఒక విధి మాత్రమే కాదని.. ప్రజాసేవకు అంకితభావం చూపించే అవకాశం కూడా అని చంద్రబాబు వివరించారు.
ప్రతి నియోజకవర్గంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమాలు పండుగలా నిర్వహించాలని సీఎం ఆదేశించారు. అలానే ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులు కలిసి గ్రామాల్లో సంక్షేమ పథకాల ప్రభావం ఎలా ఉందో ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమాల ఫోటోలు, వీడియోలు, వివరాలు పార్టీ వార్ రూమ్‌కి పంపాలని సూచించారు.

మరోవైపు టీడీపీలో తిరువూరు పంచాయితీ నడుస్తున్న విషయం తెలిసిందే. పార్టీ క్రమశిక్షణా కమిటీ ముందుకు ఎమ్మెల్యే కొలికపూడి.. ఎంపీ చిన్ని హాజరై వాదనలు వినిపించారు. ఎంపీ పైన చేసిన ఆరోపణల పైనా కొలికపూడి ఆధారాలు సమర్పించారు. అటు పార్టీకి నష్టం కలిగించేలా తాను గీతదాటి వ్యవహరించలేదని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) స్పష్టంచేశారు. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని చెప్పారు. క్రమశిక్షణ కమిటీ సభ్యులు కొనకళ్ల నారాయణరావు, వర్ల రామయ్య, ఎంఏ షరీఫ్, పంచుమర్తి అనూరాధ నేతల వాదనలు విని ఆధారాలను పరిశీలించారు. సీఎం చంద్రబాబుకు నివేదిక సమర్పించానున్నారు. దీంతో పార్టీ అధినేత ఏం నిర్ణయం తీసుకుంటారనేది హాట్ టాపిక్ గా మారింది.












Click it and Unblock the Notifications