యువంత్ ఘటనపై సీఎం చంద్రబాబు ఎమోషనల్ పోస్ట్..?
శ్రీకాకుళం జిల్లాకు చెందిన పదేళ్ల బాలుడు యువంత్ ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. యువంత్ అకాలమరణం అత్యంత బాధాకరమని వాపోయారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు పుట్టినరోజు నాడే బ్రెయిన్ డెడ్ కు గురైతే.. పుట్టెడు దుఃఖంలో ఉండి కూడా బాలుడి అవయవదానానికి ఆ తల్లిదండ్రులు అంగీకరించడం గొప్ప విషయం అన్నారు. వారి మానవతా దృక్పథం, సామాజిక బాధ్యత, మనోనిబ్బరం అందరికీ ఆదర్శనీయమని కొనియాడారు. యువంత్ కుటుంబానికి తన ప్రగాడ సానుభూతిని తెలియజేస్తూ.. ప్రభుత్వం వారికి అన్నివిధాలా అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నానని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు.
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం కాపుగోదాయవలసలో వాతాడ చిరంజీవులు, రోజా నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పదేళ్ల వయస్సు ఉన్న వారి చిన్న కుమారుడు యువంత్ ఆరో తరగతి చదువుతున్నాడు. అయితే జనవరి 29న పుట్టినరోజు చేసుకున్న యువంత్.. ఆ తర్వాత రోజు ఉదయం గొంతు నొప్పితో పాటు వాంతులతో కళ్లు తిరిగి పడిపోయాడు. దాంతో తల్లిదండ్రులు వెంటనే బాలుడిని దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు.

అయితే బాలుడికి ప్రాథమిక చికిత్స చేసినా తగ్గకపోవడంతో శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ కూడా ఎలాంటి ఫలితం లేకపోవడంతో వెంటనే విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ వైద్యులు బాలుడికి అన్ని రకాల వైద్య పరీక్షలు చేసి గులియన్ బ్యూరీ సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్లు గుర్తించారు. దాంతో అక్కడ అందుబాటులో ఉన్న వైద్యం అందించి బాలుడిని డిశ్చార్జ్ చేసి పంపించారు. కానీ బాలుడు మళ్లీ అనారోగ్యం చేయడంతో ఈ నెల 4న రాగోలు జేమ్స్ ఆస్పత్రికి తీసుకొచ్చారు.
ఇక పరిస్థితి విషమించడంతో యువంత్ బ్రెయిన్ డెడ్ అయ్యాడని వైద్యులు వెల్లడించారు. ఆ పరిస్థితుల్లో వైద్యులు అవయవదానం చేయాలని సూచించగా.. యువంత్ తల్లిదండ్రులు కూడా అంగీకరించారు. దాంతో ఆస్పత్రి బృందం వెంటనే గ్రీన్ ఛానెల్ ద్వారా ఒక మూత్రపిండం, కాలేయాన్ని విశాఖపట్టణానికి.. మరో మూత్రపిండాన్ని శ్రీకాకుళంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో బాలుడి రెండు నేత్రాల నుంచి కార్నియాలు సేకరించారు. ఆ తర్వాత బాలుడి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు. ఈ విషాద ఘటనతో వారి కుటుంబ సభ్యులు, గ్రామస్తులే కాకుండా యువంత్ తోటి విద్యార్ధులు సైతం కన్నీరుమున్నీరుగా విలపించారు.












Click it and Unblock the Notifications