టీడీపీ నుంచి వచ్చిన నేతకు సీఎం జగన్ బంపరాఫర్..!!
టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ కు సీఎం జగన్ బంపరాఫర్ ఇచ్చారు.
టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే సీఎం జగన్ ను కలిసారు. తెలుగు దేశం పార్టీతో పాటు కైకలూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి పదవికి మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ రాజీనామా చేసారు. టీడీపీలో తాను కొనసాగలేని పరిస్థితులు కల్పించారని..అందుకే పార్టీ వీడుతున్నట్లు ఇప్పటికే వెంకట రమణ ప్రకటించారు. ఈ రోజు క్యాంపు కార్యాలయంలో మంత్రి కారుమూరి నాగేశ్వర రావుతో కలిసి సీఎం జగన్ తో సమావేశమయ్యారు. నియోజకవర్గంలో పరిస్థితుల పైన సీఎం తో చర్చించారు. పార్టీ ఏ బాధ్యత అప్పగించినా చేస్తానని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో తమ పార్టీలోకి వచ్చిన వెంకట రమణకు సీఎం జగన్ బంపరాఫర్ ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో పార్టీ గెలుపుకు పని చేయాలని సూచించారు.

వైసీపీలోకి వస్తూనే మరో పదవి
కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణ టీడీపీని వీడటం పైన ఆ పార్టీ జిల్లా నేతలు కీలక వ్యాఖ్యలు చేసారు. వ్యక్తిగత లబ్ది కోసమే పార్టీ మారారని ఆరోపించారు. వెంకట రమణ పార్టీ వీడినా కైకలూరులో టీడీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసారు. మంత్రి కారుమూరితో మాట్లాడిన తరువాత వెంకటరమణ వైసీపీలో చేరాలని నిర్ణయించారు. 2014లో చంద్రబాబు మాటలు విని మోసపోయానని, ఎంత కష్టపడినా తనను బలిపశువును చేశారన్నారు. టీడీపీలో అంతా గ్రూపు రాజకీయాలే నడుస్తున్నాయని, అందుకే టీడీపీని వీడుతున్నట్లు చెప్పారు.

సీఎం హామీ..ఎమ్మెల్సీగా బరిలోకి
నియోజకవర్గ అభివృద్ధి, కొల్లేటి వాసుల జీవన ప్రమాణాల మెరుగు కోసమే పార్టీ మారేందుకు నిర్ణయించుకున్నానని వివరించారు.ఆ వెంటనే ఆయనకు ప్రభుత్వం గన్ మెన్లను కేటాయించింది. ఈ క్రమంలో వెంకట రమణ తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్ ని కలిసారు. పార్టీ కోసం తాను శక్తి మేర పని చేస్తానని హామీ ఇచ్చారు. వెంకట రమణ బీసీ వర్గానానికి చెందిన నేత. తనను కలిసిన వెంకట రమణకు ఎమ్మెల్సీ సీటు ఖరారు చేస్తూ సీఎం జగన్ ప్రకటన చేసారు. పశ్చిమ గోదావరి నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో వెంకటరమణకు అవకాశం ఇచ్చారు. ఈ నెల 23న వెంకట రమణ పశ్చిమ గోదావరి జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు.
ఏకగ్రీవంగా ఎన్నికయ్యే ఛాన్స్..
పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే నోటిఫికేషన్ కూడా జారీ అయింది. గతంలో టీడీపీ ఎమ్మెల్సీలుగా పని చేసిన అంగర రామ్మోహన్ రావు, మంతెన వెంకట సత్యనారాయణ రాజు స్థానంలో కొత్తగా ఇద్దరు ఎమ్మెల్సీలు ఎన్నిక కానున్నారు. స్థానికంగా ఉన్న సంఖ్యా బలంతో రెండు సీట్లు వైసీపీకే దక్కనున్నాయి. ఇందులో ఇప్పుడు ఒక సీటు వెంకటరమణకు కేటాయిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలొ మరో అభ్యర్ధిని వైసీపీ నుంచి ఖరారు చేయాల్సి ఉంది. రెండు స్థానాలు వైసీపీ అభ్యర్ధులు ఏకగ్రీవంగా గెలుచుకొనే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications