నాడు వైయస్.. నేడు జగన్: తిరుమలలో అరుదైన ఘట్టం: ఆ కుటుంబానికే..!
ముఖ్యమంత్రి హోదాలో తొలి సారి జగన్ శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు ధ్వజారోహణ కార్యక్రమం అనంతరం పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అయితే ఇది అరుదైన ఘట్టంగా టీటీడీ అధికారులు చెబుతున్నారు. ఒకే కుటుంబం నుండి ఇద్దరికి అందునా తండ్రీ..కొడుకులకు ఈ అరుదైన అవకాశం దక్కింది. ఒకే కుటుంబంలో తండ్రి, తనయుడు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఘనత వైఎస్ కుటుంబానికి దక్కనుంది.
జగన్ ఏ కార్యక్రమం తలపెట్టినా ముందుగా శ్రీవారి ఆశీస్సులు తీసుకోవటం ఆనవాయితీగా మార్చుకున్నారు. ఇక, ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో జగన్ శ్రీవారికి పట్టు వస్త్రాల సమర్పన ప్రత్యేక ఆకర్షణగా మారుతోంది. దీని కోసం ఇప్పటికే టీటీడీ బోర్డు సభ్యులతో పాటుగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసారు. కేంద్ర మంత్రులతోపాటుగా గవర్నర్ ను సైతం శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ చైర్మన్ ఆహ్వానించారు.

ముఖ్యమంత్రి హోదాలో తండ్రి.. తనయులు
టీటీడీ చరిత్రలో వైఎస్సార్ కుటుంబానికి అరుదైన గౌరవం దక్కుతోంది. ఒకే కుటుంబంలో తండ్రి..తనయుడు అందునా ముఖ్యమంత్రి హోదాలో శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఘనత వైఎస్ కుటుంబానికి దక్కనుంది. ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ రాజశేఖర రెడ్డి అనేక పర్యాయాలు బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ ఏడాది అదే ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర ప్రభుత్వం తరపున జగన్ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
టీటీడీ చరిత్రలో తండ్రి.. తనయులు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఇంతకుముందెప్పుడు జరగలేదు. అందునా ముఖ్యమంత్రి హోదాలో అవకాశం దక్కటం ఇదే తొలిసారి. బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు ధ్వజారోహణ కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి జగన్ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
జగన్ ప్రతీ కార్యక్రమానికి ముందు తిరుమలకు..
వైయస్ కటుంబం పైన తిరుమల విషయంలో ఎన్నో వివాదాలు..ఆరోపణలు తెర మీదకు తీసుకొచ్చారు. అయినా నాడు వైయస్.. ఇప్పుడు జగన్ ఇద్దరూ ప్రతీ కార్యక్రమం తిరుమలకు వెళ్లిన తరువాత మాత్రమే మొదలు పెట్టేవారు. జగన్ తన ప్రజాసంకల్పయాత్ర ప్రారంభించడానికి ముందు.. అదే విధంగా సుదీర్ఘ పాదయాత్ర పూర్తయిన తర్వాత వెంకన్నను కాలినడకను దర్శించుకున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత కూడా స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు.
ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. శ్రీవారి ఆలయం ముందున్న బేడి ఆంజనేయస్వామి ఆలయం నుంచి తలపై స్వామివారి శేషవస్ర్తంతో పరివట్టం కట్టుకుని మేళతాళాల మధ్య శ్రీవారికి పట్టు వస్ర్తాలు తీసుకెళ్తారు. ఆలయ మహాద్వారం ద్వారా ఆలయంలో ప్రవేశించి, గర్భాలయంలో మూలవిరాట్టు ముందు అర్చకులకి, అధికారులకు పట్టువస్త్రాలు అందిస్తారు.












Click it and Unblock the Notifications