ప్రధాని నుంచి సీఎం జగన్ కు ఆహ్వానం - కానీ, ముఖ్యమంత్రి దూరంగానే..!!
ప్రధాని మోదీతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న సీఎం జగన్ కు తాజాగా ఒక ఆహ్వానం అందింది. బీజేపీఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులతో పాటుగా సీఎం జగన్ ను ఆహ్వానించారు. ఇప్పుడు ఈ ఆహ్వానం అంశం జాతీయ స్థాయిలో చర్చ సాగుతోంది. తాజాగా జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము విజయం సాధించారు. ఈ నెల 25న నూతన రాష్ట్రపతిగా ముర్ము బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నెల 24తో ప్రస్తుత రాష్ట్రపతి కోవింద్ పదవీ విరమణ చేయనున్నారు. దీంతో..ఆయనకు వీడ్కోలు పలికే క్రమంలో భాగంగా.. ప్రధాని మోదీ విందు ఏర్పాటు ఇచ్చారు.

సీఎం జగన్ మద్దతు - ఆహ్వానం
ఈ విందులో రాష్ట్రపతి కోవింద్ దంపతులతో పాటుగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు..కేంద్ర మంత్రులు స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులతో పాటు బీజేపీ పాలిత సీఎంలు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, అధీర్ రంజన్ చౌధరి భాగస్వాములయ్యారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటుగా ఏపీ సీఎం జగన్‌కు, మహారాష్ట్ర సీఎంగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఏక్‌నాథ్ షిండేకు కూడా ఆహ్వానాలు అందాయి.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఆహ్వానం అందినా ఆరోగ్య కారణాల రీత్యా హాజరుకావడం లేదని, ఆహ్వానించినందుకు ధన్యవాదాలని ఆయన చెప్పారు. నేరుగా ఆహ్వాన కార్డులు పంపడానికి సమయం లేకపోవడం వల్ల.. దిల్లీలోని ఆ రాష్ట్రభవన్‌ల రెసిడెంట్ కమిషనర్లకు వాటిని అందిస్తున్నామని అంతకుముందు ప్రధాని కార్యాలయం వెల్లడించింది.

దూరంగానే ఉన్న సీఎం జగన్
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు పలికిన తమిళనాడు సీఎం స్టాలిన్ ను సైతం ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. ఆయన యూపీఏలో భాగస్వామిగా ఉన్నారు. ఒడిశాకు చెందిన ముర్ముకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి.. బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ సైతం మద్దతు పలికారు.
కానీ, ఈ విందుకు బీజేపీ ముఖ్యమంత్రులు మినహా ఒడిశా, ఏపీ, తమిళనాడు ముఖ్యమంత్రులెవరూ హాజరుకాలేదు. ముఖ్యమంత్రి జగన్ ఈ విందు సమయంలోనే పార్టీ నేతలతో కీలక సమావేశం ఏర్పాటు చేసారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో రానున్న ఎన్నికల పైన దిశా నిర్దేశం చేసారు.

మారుతున్న సమీకరణాలతో
తాజాగా ఏపీలో ఆర్దిక పరిస్థితులు.. పోలవరం ..బియ్యం సేకరణ పైన కేంద్ర మంత్రులు చేసిన వ్యాఖ్యల పైన వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీంతో పాటుగా బీజేపీ నేతలే హాజరవుతున్న ఈ సమావేశంలో సీఎం పాల్గొనకపోవటం వెనుక ఇది కూడా ఒక కారణంగా విశ్లేషణలు మొదలయ్యాయి. అదే విధంగా.. సీఎం జగన్ ఈ నెల 25న నూతన రాష్ట్రపతి ముర్ము ప్రమాణ స్వీకారానికి వెళ్తారని చెబుతున్నారు.
కానీ, అదే రోజున కోనసీమ జిల్లాలో గోదావరి వరద ముంపు గ్రామాల పర్యటనకు సీఎం వెళ్లాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఏపీలో ఎన్నికల దిశగా సీఎం జగన్ అడుగులు వేస్తున్న వేళ.. కేంద్ర ప్రభుత్వంలోని ముఖ్యులో సంబంధాలు..అటు టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాలు..బీజేపీ కార్యాచరణ ఆసక్తి కరంగా మారుతున్నాయి.












Click it and Unblock the Notifications