తాజా మాజీ మంత్రులకు సీఎం జగన్ బంపరాఫర్ - కేబినెట్ హోదాతో : ముఖ్యమంత్రి ఉద్వేగం..!!
ఏపీ మంత్రివర్గం రాజీనామా చేసింది. మొత్తం 24 మంది మంత్రులు తమ రాజీనామా లేఖలను సమర్పించారు. కొత్త కేబినెట్ ఏర్పాటుకు వీలుగా వారు మంత్రి పదవుల నుంచి తప్పుకున్నారు. దీంతో..వారంతా మాజీలు అయ్యారు. కానీ, వారి రాజీనామాలు ఆమోదించే వారకూ తాజా మాజీ మంత్రులుగా కొనసాగుతారు. ఇక, ఒకే సారి 24 మంది మంత్రుల నుంచి రాజీనామాలు తీసుకున్న సమయంలో..వారిని ఎందుకు తప్పించాల్సి వచ్చింది అనే విషయం వివరించే సమయంలో ముఖ్యమంత్రి జగన్ ఒకింత ఉద్వేగానికి గురయ్యారని తెలుస్తోంది.
కానీ, మంత్రులు మాత్రం రాజీనామా చేస్తున్నందుకు మేమెవరం బాధపడటం లేదు.. మీరు బాధపడొద్దు అంటూ సీఎంతో చెప్పారు. అదే సమయంలో రాజీనామా చేసిన మంత్రులకు వారికి అప్పగించే బాధ్యతలతో పాటుగా మరో కీలక ఆఫర్ ఇచ్చారు.

చంద్రబాబును ఓడిస్తే .. ఆ తరువాత..
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడిస్తే .. ఆ తరువాత ఇక మనకు పోటీ ఉండదని చెప్పుకొచ్చారు. వెయ్యి రోజులు మంత్రులుగా పని చేసారు..700 రోజులు పార్టీ కోసం పని చేయండి..తిరిగి పార్టీని అధికారంలోకి తీసుకొస్తే..మీరే మరోసారి కేబినెట్ లోకి వస్తారంటూ సీఎం వారిని స్పష్టం చేసారు.
అదే సమయంలో మంత్రి పదవులు కోల్పోతున్న వారికి జిల్లా..ప్రాంతీయ బాధ్యతలను అప్పగిస్తామని చెబుతూనే... మంత్రులుగా ఇప్పటి వరకు పొందిన గౌరవానికి ఏ మాత్రం భంగం లేకుండా ఏర్పాట్లు చేసేందుకు ఆలోచన చేస్తున్నామని చెప్పుకొచ్చారు. జిల్లాకో అభివృద్ధి మండళ్లు ఏర్పాటు చేసి వాటి బాధ్యతలను మీకు అప్పగించి, మీ అందరికీ కేబినెట్ హోదా కల్పించే విషయాన్ని కూడా ఆలోచిస్తున్నామని సీఎం వెల్లడించారు.

మాజీలకు కొత్త హోదాలో
అదే విధంగా ఇప్పుడున్న మంత్రుల్లో కొందరిని కొనసాగించటం ద్వారా..మిగిలిన వారిని తక్కువ చేసినట్లు కాదని చెప్పారు. దానివల్ల రాజీనామా చేసిన తరువాత కొత్త హోదాల్లో వీరంతా అధికారిక సమావేశాల్లో మంత్రులతో సమానంగా వేదికలపై కూర్చునే వీలుంటుందని చెప్పినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే ఒక కార్యాచరణ సిద్ధం చేస్తామని సీఎం చెప్పుకొచ్చారు.
రాజకీయ సమీకరణాల కారణంగానే ఇలా చేయాల్సి వస్తోందని చెప్పారు. వచ్చే రెండేళ్లలో పార్టీ బలోపేతానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందని స్పష్టం చేసారు. గడపగడపకు వైసీపీ కార్యక్రమం విస్తృతంగా చేపట్టాలని నిర్దేశించారు. 11న జరిగే కేబినెట్ విస్తరణకు అందరూ రావాలని సీఎం సూచించారు. కొత్త మంత్రుల శాఖలో నిర్వహణలో వారికి సహకారం అందించండని సీఎం పేర్కొన్నారు.

సీఎం ఒకింత ఉద్వేగానికి లోనవుతూ
మంత్రులుగా అందరూ ఇంతకాలం బాగా పని చేసారని.. పార్టీని బలోపేతం చేసుకొనేందుకే..పార్టీ బాధ్యతలు చూడాలంటూ సీఎం చెప్పారు. ఆ సమయంలో సీఎం ఉద్వేగానికి లోనవ్వటం గమనించిన కొందరు మంత్రులు తామెవరమూ మంత్రులు రాజీనామా చేస్తున్నందుకు బాధ పడటం లేదని... మీరు బాధపడవద్దంటూ సీఎంతో చెప్పారు. దీంతో..సీఎం వారికి భవిష్యత్ లో కల్పించే ప్రాధాన్యత గురించి వివరించారు. మంత్రి అవంతి జోక్యం చేసుకుంటూ తమకు ఇప్పుడు బాధ లేదని.. పార్టీలోనే ఉంటాం..ఎక్కడికీ వెళ్లం.. మీతోనే కొనసాగుతామని స్పష్టం చేసినట్లు తెలిసింది.

కేబినెట్ హోదా..మంత్రి ఒకటే కాదంటూ
అయితే, ప్రభుత్వ సలహాదారు హోదాలో జిల్లా ప్రాంతీయ మండళ్ల ఛైర్మన్లుగా ప్రస్తుత మంత్రులకు కేబినెట్ హోదా కల్పించే దిశగా సీఎం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. కానీ, ఇదే విషయం పైన మంత్రుల మధ్య చర్చలు సాగుతున్నాయి. కేబినెట్ మంత్రికి.. కేబినెట్ హోదాకు చాలా తేడా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో..ఈ రోజు లేదా రేపు ఈ పదవుల అంశం పైన సీఎం తుది నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications