మంత్రి మేకపాటికి తుది వీడ్కోలు: శోకసంద్రంగా నెల్లూరు: రేపు ఉదయగిరికి జగన్: షెడ్యూల్ ఇదే
నెల్లూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం నెల్లూరు జిల్లా ఉదయగిరికి బయలుదేరి వెళ్లనున్నారు. తన మంత్రివర్గ సహచరుడు మేకపాటి గౌతమ్ రెడ్డి పార్థివదేహానికి నివాళి అర్పించనున్నారు. అంత్యక్రియలకు హాజరు కానున్నారు. ఉదయం 9:30 నిమిషాలకు వైఎస్ జగన్ తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరి వెళ్తారు. 10 గంటలకు ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయానికి వెళ్తారు. 10:45 నిమిషాలకు కడపకు చేరుకుంటారు.
Recommended Video
అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఉదయగిరికి వెళ్తారు. ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (మెరిట్)కు చేరుకుంటారు. మెరిట్ ఆవరణలో హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. రోడ్డు మార్గంలో గౌతమ్ రెడ్డి నివాసానికి చేరుకుని, ఆయన పార్థివ దేహానికి నివాళి అర్పిస్తారు. మళ్లీ మధ్యాహ్నం 1:30 గంటలకు క్యాంప్ కార్యాలయానికి తిరిగి వస్తారు. సోమవారం ఉదయం గుండెపోటుతో కన్నుమూసిన గౌతమ్ రెడ్డి పార్థివ దేహాన్ని ఈ ఉదయం హైదరాబాద్ నుంచి ఆర్మీ హెలికాప్టర్‌లో నెల్లూరుకు తరలించారు.

జిల్లా ప్రజల సందర్శనార్థం మేకపాటి క్యాంపు కార్యాలయంలో పార్థివదేహాన్ని ఉంచారు. జిల్లాకే చెందిన జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. అక్కడి ఏర్పాట్లను పర్యవేక్షించారు. తోటి మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, మేకపాటి కుటుంబం అభిమానులు గౌతమ్ రెడ్డి పార్థివ దేహానికి నివాళి అర్పిస్తున్నారు. గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో జిల్లావ్యాప్తంగా విషాద ఛాయలు అలముకున్నాయి.
అంతిమ చూపు కోసం జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు నెల్లూరుకు చేరుకుంటున్నారు. మృధుస్వభావి, మానవతావాది, స్నేహశీలి, వివాదారహితుడిగా ఆయనను రాజకీయాలకు అతీతంగా అందరూ అభిమానిస్తారు. తన మంత్రివర్గ సహచరుడు ఇక లేడనే విషయాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నానని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబ సభ్యుడిని, పెద్దన్నను కోల్పోయానని చెప్పారు.












Click it and Unblock the Notifications