ఢిల్లీలో జగన్: ఇంకాసేపట్లో కీలక భేటీ..!!
న్యూఢిల్లీ: ఏపీలో రాజకీయాలు హీటెక్కాయి. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనంతరం ఆ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ వస్తోన్నాయి. ఈ ఘటన తరువాత టీడీపీతో పొత్తును ప్రకటించింది జనసేన పార్టీ.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ దేశ రాజధానిలో మకాం వేశారు. మూడు వారాలుగా ఆయన అక్కడే ఉంటోన్నారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారాన్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్లడానికి ప్రయత్నాలు సాగిస్తోన్నారు. అవేవీ పెద్దగా ఫలిస్తోన్నట్లు కనిపించట్లేదు. ప్రస్తుతం నారా లోకేష్ ఢిల్లీలోనే ఉంటోన్నారు.

ఈ పరిస్థితుల మధ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. హస్తిన పర్యటన చేపట్టారు. కొద్దిసేపటి కిందటే దేశ రాజధానికి చేరుకున్నారు. రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటారు. ఢిల్లీ విమానాశ్రయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ వీ విజయసాయిరెడ్డి, ఎంపీలు ఆర్ కృష్ణయ్య, మార్గాని భరత్ తదితరులు స్వాగతం పలికారు.
ఈ సాయంత్రం 6:30 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌తో సమావేశం కానున్నారు వైఎస్ జగన్. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పోలవరం ప్రాజెక్ట్ బకాయిల విడుదల వంటి అంశాలను ఆమె దృష్టికి తీసుకెళ్లనున్నారు. పెండింగ్ నిధుల గురించి ఇదివరకే ఆమెకు మెమొరాండాన్ని సమర్పించారాయన.
శుక్రవారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలుస్తారు. ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన హామీల అమలు గురించి ప్రస్తావిస్తారు. అనంతరం కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురిని కలుసుకుంటారు. విశాఖపట్నంలో మెట్రో రైలు కారిడార్ అభివృద్ధికి సంబంధించిన డీపీఆర్‌ను అందజేసే అవకాశం ఉంది.
ఆ తరువాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అవుతారు. పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన.. భారతీయ జనతా పార్టీతో తెగదెంపులు చేసుకుంటుందని, ఎన్డీఏ నుంచి బయటికి వస్తుందంటూ వార్తలు వస్తోన్న వేళ.. రాష్ట్రంలో చోటు చేసుకుంటోన్న తాజా రాజకీయ పరిణామాల గురించి చర్చించే అవకాశం ఉందని సమాచారం.












Click it and Unblock the Notifications