ఏపీలో మంత్రివర్గ ప్రక్షాళనకు ముహూర్తం: ఆ రెండు తేదీల్లో ఛాన్స్: ఎన్నికల టీమ్?
అమరావతి: రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం కుదిరిందా?..ఈ దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కసరత్తు పూర్తి చేశారా?..ఈ నెలలోనే పునర్వ్యవస్థీకరించదలచుకున్నారా?.. దీనికోసం తాత్కాలికంగా రెండు తేదీలను కూడా ఖాయం చేసుకున్నారా?.. అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఈ నెలలోనే మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. ఒకరిద్దరు సీనియర్లు తప్ప మిగిలిన వారందరినీ తొలగించి.. కొత్త ముఖాలకు అవకాశం ఇచ్చేలా అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు.

హామీ మేరకే..
2019లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సమయంలో ఇచ్చే సమయంలో ఇచ్చిన హామీ మేరకే వైఎస్ జగన్.. తన మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేయడానికి పూనుకుంటున్నారు. రెండున్నర సంవత్సరాల తరువాత మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరిస్తానని, కొత్త వారికి అవకాశం ఇస్తానని ఆయన వెల్లడించారు. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. దీనిపై దాదాపు కసరత్తు పూర్తయిందని, కొత్త మంత్రులను ఎంపిక వ్యవహారంలో జిల్లాల నుంచి అందిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా చేసుకున్నారని సమాచారం.

ఇప్పటికే జాప్యం..
ఏపీ కేబినెట్ విస్తరణ ఇప్పటికే ఆలస్యమైందని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు తెలుస్తోంది. మహూర్తం ఎప్పుడు పెడతారనేది తేలలేదు. సంక్రాంతి నాటికే కేబినెట్ రీషఫల్ ఉంటుందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుదల బాట పట్టడం, పీఆర్సీ అంశాల నేపథ్యంలో దీనిపై ముఖ్యమంత్రి పెద్దగా దృష్టి సారించలేదని చెబుతున్నారు. పీఆర్సీ వివాదం మినహా ప్రభుత్వ సమక్షంలో ప్రస్తుతం ఇతరత్రా సమస్యలేవీ లేనందున.. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు దిగారని అంటున్నారు.

ఎన్నికల టీమ్..
రాబోయేది సార్వత్రిక ఎన్నికల సమయం కావడం వల్ల.. దానికి అనుగుణంగా వైఎస్ జగన్ తన కొత్త టీమ్‌ను ఏర్పాటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు రెండున్నర సంవత్సరాల్లో పరిపాలనతో పాటు రాజకీయానికి ప్రాధాన్యత ఇస్తారని, ప్రతిపక్ష పార్టీలు చేసే విమర్శలను సమర్థవంతంగా తిప్పి కొట్టడం.. తాము అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రాజెక్టులను అంతే సమర్థవంతంగా జనంలోకి తీసుకెళ్లగలిగే వారికి మంత్రివర్గంలో తీసుకుంటారని చెబుతున్నారు.

ఆ రెండు తేదీల్లో..
ఈ నెల 16 లేదా 22వ తేదీల్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉండొచ్చనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. నూతన తెలుగు సంవత్సరాది ఉగాది నుంచి కొత్త జిల్లాలు మనుగడలోకి రానున్న నేపథ్యంలో- ఆ లోపే కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పూర్తి చేయాలనే నిర్ణయానికి వైఎస్ జగన్ వచ్చారని అంటున్నారు. కొత్త జిల్లాలు.. కొత్త మంత్రులతో రాష్ట్ర పరిపాలనను సాగించాలని ఆయన నిశ్చయించినట్లు తెలుస్తోంది.

సామాజిక సమతుల్యత..
మంత్రివర్గాన్ని విస్తరించాలనే నియమం అంటూ ఏదీ లేదు. ఇచ్చిన హామీ మేరకే ముఖ్యమంత్రి.. తన కొత్త టీమ్‌ను ఏర్పాటు చేసుకోదలిచినట్లు తెలుస్తోంది. ప్రస్తుత మంత్రివర్గంలో అవకాశం రానివారికి బెర్త్ కన్‌ఫర్మ్ చేయడం, ఇప్పట్లాగే అన్ని సామాజిక వర్గాలకు తగిన ప్రాధాన్యతను కల్పించడం.. వల్ల సార్వత్రిక ఎన్నికలకు వెళ్లే సమయానికి కొత్త టీమ్‌ను ఏర్పాటు చేసుకోగలిగితే అది అన్ని రకాలుగా మరింత బలాన్ని ఇస్తుందని వైఎస్ జగన్ గట్టిగా నమ్ముతున్నారని అంటున్నారు.

కొత్త జిల్లాలు అనుగుణంగా మంత్రులు..
కొత్త జిల్లాలకు అనుగుణంగా మంత్రులను ఎంపిక చేసుకున్నారని కూడా తెలుస్తోంది. ఈ క్రమంలో మంత్రుల సంఖ్య కూడా స్వల్పంగా పెరిగే అవకాశం లేకపోలేదని అభిప్రాయాలు కూడా వినిపిస్తోన్నాయి. రాయలసీమ, ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువ మందిని మంత్రివర్గంలోకి తీసుకునేలా జాబితాను సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. రాజకీయ, సామాజిక సమీకరణాల ప్రకారం కొత్త మంత్రివర్గం కూర్పు ఉంటుందని తెలుస్తోంది.
Recommended Video

సీనియర్లను మినహాయించి..
ఒకరిద్దరు సీనియర్లు మినహా దాదాపు మంత్రులందరినీ తొలగిస్తారనే ప్రచారం ఉంది. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వంటి సీనియర్లు మినహా మిగిలిన వారిని సాగనంపుతారని చెబుతున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి ప్రమోషన్ ఇవ్వొచ్చనీ అంటున్నారు. తిరుపతి లోక్‌సభ, బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించడానికి పెద్దిరెడ్డి కారణమని వైఎస్ జగన్ నమ్ముతున్నారని, ఆయనను కొనసాగిస్తారని అంటున్నారు.












Click it and Unblock the Notifications