గ్రామ,వార్డు వాలంటీర్లకు గుడ్ న్యూస్... సీఎం జగన్ కీలక నిర్ణయం..
కరోనాపై పోరులో ముందుండి పోరాడుతున్న వైద్యులు,పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల గరీబ్ కల్యాణ్ యోజన పథకం కింద రూ.50లక్షలు భీమా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ ప్రభుత్వం గ్రామ వాలంటీర్లను కూడా ఈ భీమా పరిధిలో చేర్చాలని నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని,డీజీపీ గౌతమ్ సవాంగ్,వైద్యారోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్ రెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి దీనిపై చర్చించారు.
గ్రామ,వార్డు వాలంటీర్లతో పాటు గ్రామ సచివాలయ ఉద్యోగులు, ఆశా వర్కర్స్‌కు కూడా రూ.50లక్షల భీమా పరిధిలో చేర్చాలని ఆదేశించారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఇటీవల నిర్వహించిన ఇంటింటికి సర్వేలో వాలంటీర్లు కీలక పాత్ర పోషించారు. ఫీల్డ్‌లో పనిచేస్తుండటంతో.. కరోనా పేషెంట్ల ద్వారా వారికి వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో.. ఈ భీమాను వర్తింపజేస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో ఉన్న 2,60,000 మంది గ్రామ, వార్డు వాలంటీర్లకు ఈ కరోనా బీమా వర్తించనుంది.

ఇక కరోనా కేసుల విషయానికొస్తే.. రాష్ట్రంలో ఇప్పటివరకూ 757 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 96 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 22 మంది మృతి చెందారు. ప్రస్తుతం 639 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. జిల్లా కరోనా ఆసుపత్రుల్లో వీరికి వైద్య చికిత్స అందుతోంది. కర్నూలులో అత్యధికంగా 184 కరోనా కేసులు నమోదవగా.. గుంటూరులో 158, కృష్ణా జిల్లాలో 83, నెల్లూరులో 67 కేసులు నమోదయ్యాయి. ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం,విజయనగరంలలో ఇప్పటికీ ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదవలేదు.












Click it and Unblock the Notifications