నగరికి వైఎస్ జగన్- తల్లుల ఖాతాల్లో నిధులు విడుదల: సత్తా చాటడానికి రోజా రెడీ
చిత్తూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పథకాల్లో ఒకటి- జగనన్న విద్యా దీవెన. ఉన్నత చదువులను అభ్యసించాలనుకునే లక్షలాది మంది విద్యార్థులకు ఈ పథకం కింద ఆర్థిక సహాయం చేస్తోంది ప్రభుత్వం. ప్రతి విద్యా సంవత్సరం ఆరంభంలో ఈ మొత్తాన్ని విడుదల చేస్తోంది.
ఇంజినీరింగ్, మెడిసిన్, డిగ్రీ కోర్సులు చదివే విద్యార్థులకు 20,000 రూపాయలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు 15,000, ఐటీఐ స్టూడెంట్స్‌కు 10,000 రూపాయల మొత్తాన్ని వారి తల్లుల ఖాతాల్లో జమ చేస్తోంది. మరోసారి ఈ పథకం కింద ప్రభుత్వం నిధులను విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఈ నెల 28వ తేదీన దీనికి ముహూర్తం పెట్టింది ప్రభుత్వం.

జగనన్న విద్యా దీవెన పథకం కింద నిధులను విడుదల చేయడానికి వైఎస్ జగన్.. చిత్తూరు జిల్లా నగరికి వెళ్లనున్నారు. నగరిలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో బటన్ నొక్కి.. విద్యా దీవెన కింద నిధులను తల్లుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం చేపట్టింది.
పర్యాటక శాఖ మంత్రి ఆర్ కే రోజా సొంత నియోజకవర్గం.. నగరి. ఇక్కడ వైఎస్ జగన్ బహిరంగ సభను ఏర్పాటు చేయడం, సంక్షేమ పథకంలో భాగంగా నిధులను విడుదల చేయబోతోండటం ఇదే తొలిసారి. దీనితో ఈ సభను విజయవంతం చేయడానికి రోజా తక్షణ చర్యలు తీసుకుంటోన్నారు.
ఈ మధ్యాహ్నం ఆమె చిత్తూరులో జిల్లాకు చెందిన మంత్రులు కే నారాయణ స్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కలెక్టర్ షన్మోహన్, పోలీస్ సూపరింటెండెంట్ రిశాంత్ రెడ్డి.. ఇతర ఉన్నతాధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సభకు భారీగా జనాన్ని సమీకరించడం ద్వారా తన సత్తాను చాటాలనే పట్టుదలతో ఉన్నారు రోజా.












Click it and Unblock the Notifications