అలీకి సీఎం జగన్ బంపర్ ఆఫర్..?
నటుడు అలీకి సీఎం జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చారా అంటే అవుననే అంటున్నాయి వైసీపీ వర్గాలు. ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో దిగాలని అలీ భావిస్తున్నారు. దీనిలో భాగంగానే రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో అలీ బరిలోకి దిగబోతున్నారని సమాచారం. వాస్తవానికి 2019 ఎన్నికల్లోనే ఆయన పోటీ చేయాలని భావించారు.
కానీ సరిగ్గా ఎన్నికల ముందు వైసీపీలో చేరడంతో జగన్ అలీకి టికెట్ కేటాయించలేకపోయారు. టికెట్ దక్కకపోయినప్పటికీ పార్టీ తరుఫున అలీ ప్రచారం నిర్వహించారు. అలీ ప్రచారం చేసిన మైనారిటీ నియోజకవర్గాల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. జగన్ సీఎం అయిన తరువాత అలీకి ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ పదవులు ఇస్తారని ప్రచారం జరిగింది.

జగన్ మాత్రం ఆయనకు ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడు పోస్టుతో సరిపెట్టారు. అయినప్పటికీ ఎక్కడా నిరాశ చెందకుండా పార్టీ బలోపేతం కోసం విసృతంగా కృషి చేస్తున్నారాయన. ప్రస్తుతానికి అయితే అలీ వైసీపీలో యాక్టివ్‌గా పని చేస్తున్నారు. సామాజిక సాధికార యాత్రలో జగన్ చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలు గురించి ప్రజలకు తెలియజేస్తున్నారు.
ఇదిలా ఉంటే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనే తన కోరికను అలీ పార్టీ అధిష్టానం ముందుంచారట. అలీపై సానుకూలంగా ఉన్న వైసీపీ అధిష్టానం సైతం ఆయనకు వచ్చే ఎన్నికల్లో ఎంపీగా బరిలోకి దింపాలని చూస్తున్నారట. ముస్లింలు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో అలీని బరిలోకి దింపితే ఫలితం ఉంటుందని జగన్ భావిస్తున్నారని తెలుస్తోంది.

దీనిలో భాగంగానే కర్నూల్‌తో పాటు నంద్యాల పార్లమెంట్ స్థానాల పరిధిలో ముస్లిం ఓటర్లు అధిక సంఖ్యలో ఉంటారు. ఆ రెండిటిలో ఒకచోట పోటీ చేస్తే అలీ తప్పకుండా విజయం సాధిస్తారనే అంచనాకు అధికార పార్టీ వచ్చినట్టు సమాచారం. ఈ రెండు నియోజకవర్గాల్లో ఏదో ఒక చోట నుంచి అలీ బరిలోకి దిగుతారని సమాచారం. అన్ని అనుకున్నట్టు జరిగితే వచ్చే ఎన్నికల్లో అలీ ఎంపీగా పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications