విడిగా వెళ్తే ఏమౌతుంది: తెరాసపై కాంగ్రెస్ ఆరా, లెక్కలు
న్యూఢిల్లీ: తెలంగాణ ప్రాంతంలో ఒంటరిగా ఎన్నికలకు వెళితే తెలంగాణ రాష్ట్ర సమితికి వచ్చే సీట్లు ఎన్ని, తమకు వచ్చేవి ఎన్ని అనే విషయమై కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఆరా తీస్తోంది. ఈ సమయంలో తెరాసకు ఎన్ని సీట్లు వస్తాయన్న విషయంపై ఆ పార్టీ నేతల నుంచే సరైన అంచనాలు వినపడడం లేదట. అయితే, ఒంటరిగా వెళ్లినా కాంగ్రెసు పార్టీయే గెలుస్తుందని వారు ఢిల్లీ పెద్దల వద్ద ధీమా వ్యక్తం చేస్తున్నారుట.
అయితే, నీల్సన్ ఓఆర్‌జి సర్వే ప్రకారం తెరాసకు 40 నుండి 45 సీట్లు, కాంగ్రెస్‌కు 47 నుండి 52 సీట్లు వస్తాయని, తెలుగుదేశం పార్టీ సహా ఇతర పార్టీలకు 27 నుండి 35 సీట్లు లభిస్తాయని తేలింది. అంటే, తెరాస కంటే కాంగ్రెసు పార్టీయే ముందుంటుందని సర్వేలో తేలింది.

తెరాస ఉద్యమం చేసినా, కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చినా.. ఇతర పార్టీలే తెలంగాణ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తాయని సమాచారం. ఎన్నికల తర్వాత కూడా కాంగ్రెస్, తెరాస చేతులు కలపక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని వివేక్ తదితరులు వాదిస్తున్నట్లు తెలిసింది.
అయితే, కాంగ్రెస్ వర్గాల అంతర్గత సర్వే ప్రకారం తెరాసకు ముప్పై సీట్లు మాత్రమే లభిస్తాయని తేలిదంట. రాజ్యసభ సభ్యులు ఒకరు ఈ మేరకు సర్వే జరిపించి అధిష్ఠానానికి నివేదిక ఇచ్చారంటున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ అరవై సీట్ల మార్కును దాటుతుందని చెప్పారట. అయితే, తెరాస వాదన మాత్రం మరోలా ఉంది. తెరాస ఎనభై సీట్లకు పైగా గెలుచుకుంటుందని ఆ పార్టీ క్యాడర్ ధీమా వ్యక్తం చేస్తోంది.












Click it and Unblock the Notifications