మొన్న గుడివాడ- ఇప్పుడు విజయవాడ: క్లారిటీ లేని రేణుక చౌదరి
తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు, కేంద్ర మాజీమంత్రి రేణుకా చౌదరి.. ఏపీ రాజకీయాల్లోకి ప్రవేశించడంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
విజయవాడ: తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు, కేంద్ర మాజీమంత్రి రేణుకా చౌదరి.. ఏపీ రాజకీయాల్లోకి ప్రవేశించడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే- ఏపీ రాజకీయాల్లోనూ అడుగు పెడతానని, ఇక్కడి నుంచే ఎన్నికల్లో పోటీ చేస్తాననీ అన్నారు. గతంలో ఆమె అమరావతి ప్రాంత రైతుల ఆందోళనలకు మద్దతు పలికారు. ఇదివరకు అమరావతి నుంచి అరసవల్లి వరకు సాగుతున్న రైతుల పాదయాత్రలో పాల్గొన్నారు కూడా.
ఇదివరకు రేణుకా చౌదరి.. మాజీ మంత్రి కొడాలి నానిపై విమర్శలు గుప్పించారు. కొడాలి నాని వల్ల తనకు ఫ్రీ పబ్లిసిటీ వచ్చిందంటూ ఎద్దేవా చేశారు. 2024 ఎన్నికల్లో గుడివాడ నుంచి పోటీ చేస్తాననీ అప్పట్లో ప్రకటించారు. ఖమ్మంలో గెలవలేనంటూ కొడాలి నాని సవాల్ చేశారని, అందుకే ఆయన నియోజకవర్గం గుడివాడ నుంచే పోటీ చేస్తాననీ సవాల్ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగానే గుడివాడ నుంచి ఏపీ అసెంబ్లీకి పోటీ చేస్తానని వివరించారు.

తెలుగుదేశం పార్టీ మద్దతు తనకు అవసరం లేదని రేణుక చౌదరి స్పష్టం చేశారు. గుడివాడలో కొడాలి నానిని ఓడించి సత్తా చూపిస్తానంటూ సవాల్ చేశారు. రాజకీయాల్లో తనకు ఓటమి లేదని, ఖమ్మం ఎంపీగా తాను అత్యధిక సార్లు గెలిచానని గుర్తు చేశారు. జిల్లా అభివృద్ధి కోసం తాను చేసినంత కృషి మరెవరూ చేయలేదని చెప్పారు. కొడాలి నాని వచ్చి ఖమ్మం జిల్లా గల్లీల్లో తిరిగి చూస్తే తానేంటో, తన శక్తి సామర్థ్యాలేమిటో ఆయనకు బోధపడుతుందని రేణుకా చౌదరి అన్నారు.
ఇప్పుడు తాజాగా రేణుకా చౌదరి మరోసారి ఏపీ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ఇవ్వాళ ఆమె విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. ఏపీలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా తయారైందని ఆరోపించారు. పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే ఏపీ నుంచి పోటీ చేస్తానని అన్నారు. విజయవాడ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు రేణుకా చౌదరి చెప్పారు. జగన్ పరిపాలనలో ప్రజలు నరకం అనుభవిస్తున్నారంటూ విమర్శించారు.
వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఆమె ఏపీ ఓటర్లకు సూచించారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. రాజధాని నిర్మాణం కోసం వేల ఎకరాలను ఇచ్చిన రైతులను జగన్ ప్రభుత్వం ఆదుకోవట్లేదని ధ్వజమెత్తారు. అమరావతి ప్రాంత రైతులను మోసం చేసిందని విమర్శించారు. శాంతియుతంగా నిరసనలు, పాదయాత్రలు చేస్తున్న రైతుల, మహిళల సమస్యలను పట్టించుకోవట్లేదని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications