వణికిస్తున్న కరోనా; పెరిగిన యాక్టివ్ కేసులు; ఏపీ, తెలంగాణాలో తాజా పరిస్థితి ఇలా!!
దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతుంది. కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న క్రమంలో మరణాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. దీంతో ప్రజలు మళ్లీ కరోనా మహమ్మారి పట్ల భయంతో వణికి పోతున్నారు. 412 తాజా కరోనా కేసుల చేరికతో భారతదేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,093కి చేరుకుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్లో పేర్కొంది.
ఇప్పటికి కరోనా మహమ్మారి కారణంగా కర్నాటకలో మూడు కొత్త మరణాలు నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు రోగులు మృతి చెందారు. ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా మహమ్మారి కారణంగా కేజీహెచ్లో చికిత్స పొందుతూ ఒక మహిళ మృతి చెందింది. ఉదయం 8 గంటలకు నవీకరించబడిన మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, కరోనా మహమ్మారి కారణంగా మరణించిన వారి సంఖ్య 533340 కు చేరుకుంది.

ఇప్పటివరకు కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 1.18 శాతంగా ఉన్నట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రస్తుతం, భారతదేశం యొక్క కోవిడ్ కేసుల సంఖ్య 4,50,09,660 వద్ద ఉంది. అయితే జాతీయ రికవరీ రేటు 98.81శాతంగా ఉంది. మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం. పెరుగుతున్న COVID-19 సబ్-వేరియంట్ JN.1 కేసులతో ఆందోళన మరింత పెరుగుతుంది. ఆదివారం వరకు మొత్తం 63 సబ్ వేరియంట్ కేసులు భారతదేశంలో నమోదైనట్టుగా తెలుస్తుంది.
ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే తెలంగాణ రాష్ట్రంలో 8 కరోనా కేసులు నమోదయ్యాయని అధికారిక డేటా వెల్లడించింది. ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా 59 మంది చికిత్స పొందుతున్నారని, ఒక వెయ్యి 333 మందికి కరోనా పరీక్షలు చేయగా, మరో 30 మంది నివేదికలు రావాల్సి ఉందని చెబుతున్నారు.
ఇప్పటివరకు కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్రంలో 4,111 మళ్లీ మృత్యువాత పడగా, తాజాగా మళ్లీ మరణాలు నమోదవుతున్న క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక ఏపీలో కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్నట్టు గా తెలుస్తుంది నిన్న ఒక్కరోజే ఏపీలో ఆరు కొత్త కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలో 29 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్టు విశాఖ జిల్లాలో ఐదు శ్రీకాకుళం జిల్లాలో ఒకరు నిన్న కరోనా మహమ్మారి బారిన పడ్డారు.












Click it and Unblock the Notifications