Cyclone Montha: ఏపీ వైపు దూసుకొస్తోన్న భారీ తుఫాన్
బంగాళాఖాతంలో అతి తీవ్ర తుఫాన్ ఏర్పడబోతోంది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం ఈ మధ్యాహ్నానికి వాయుగుండంగా మారబోతోంది. పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా బలపడనుంది. అక్కడితో దీని ప్రయాణం ఆగట్లేదు. క్రమంగా ఇది తుఫాన్ ను అవతరించనుంది. సోమవారం నాటికి నైరుతి, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తుఫాన్ గా మారనుంది.
దీనికి మోంథాగా నామకరణం సైతం చేశారు. దీని ప్రభావం దక్షిణాదిపై తీవ్రంగా ఉండనుంది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల్లో ఈ నెల 27వ తేదీ నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తమిళనాడులోని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఏపీ తీర ప్రాంతం అల్లకల్లోలానికి గురి అవుతుందని, మత్స్యకారులెవరూ చేపలవేటకు సముద్రం మీదికి వెళ్లకూడదని సూచించింది.

ఈ తుఫాన్ కు థాయ్‌లాండ్ ఈ పేరు (Cyclone Montha)ను సూచించింది. మోంథా అంటే థాయ్ భాషలో సువాసన లేదా అందమైన పువ్వు అని అర్థం. భారత్, బంగ్లాదేశ్, ఇరాన్, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్తాన్, ఖతార్, సౌదీ అరేబియా, శ్రీలంక, థాయ్‌లాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యెమెన్ వంటి 13 సభ్య దేశాలతో కూడిన ప్యానెల్ ఆన్ ట్రాపికల్ సైక్లోన్స్ ద్వారా ఈ పేర్లను సూచిస్తాయి. ఇది థాయ్ లాండ్ టర్మ్. తుఫాన్లకు ఇలా పేరు పెట్టడం వల్ల వాటి ట్రాకింగ్ సులభంగా ఉంటుంది.
కాగా- చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాలకు వర్ష హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 26న తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయి. తిరువళ్లూరు, చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, రాణిపేట్, విల్లుపురం జిల్లాలతో పాటు పుదుచ్చేరిలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
27న తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయి. కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరు, చెన్నై, రాణిపేట్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 28న తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయి. కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరు, చెన్నై, రాణిపేట్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయి.
అక్టోబర్ 29న తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఈ కాలంలో మత్స్యకారులు తమిళనాడు తీరం, గల్ఫ్ ఆఫ్ మన్నార్, కొమరిన్ ప్రాంతాల్లో సముద్రంలోకి వెళ్లవద్దని ఐఎండీ సూచించింది. ఇప్పటికే సముద్రంలో ఉన్న మత్స్యకారులు అక్టోబర్ 24 సాయంత్రం లోగా తీరానికి తిరిగి రావాలని అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications