వాయుగుండంగా మారిన అల్పపీడనం..! ఉత్తరాంధ్రకు అలర్ట్..!
వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై నిన్న ఏర్పడిన అల్పపీడనం కాస్తా ఇవాళ వాయుగుండంగా (cyclonic storm) బలపడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది వాయువ్య దిశగా కదులుతూ, రాబోయే 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపారు. ఇది రేపు ఉదయం లేదా మధ్యాహ్నానికి పారాదీప్-సాగర్ ద్వీపాల మధ్య ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలను దాటే అవకాశం ఉందన్నారు.
దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 55-65 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే సముద్రం అలజడిగా ఉండి, అలలు ఎగసిపడే సూచనలు ఉన్నాయన్నారు. ఏడు మీటర్ల కంటే తక్కువ వెడల్పు ఉన్న పడవలు ఉపయోగించడం సురక్షితం కాదని మత్సకారులకు వారు సూచించారు. మత్స్యకారులు బుధవారం వరకు సముద్రంలో వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు. అలాగే తీరప్రాంత ప్రజలు, మత్స్యకారులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు.

ఇప్పటికే ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రమంతా ఉక్కపోత, ఎండలతో జనం సతమతం అవుతున్నారు. ఇలాంటి సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండం స్థాయికి వెళ్లడంతో కనీసం తీర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. బుధవారం వరకూ రాష్ట్రంలో వాతావరణం చల్లగా ఉండే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో ఈదురుగాలుల ప్రభావం నేపథ్యంలో మత్సకారులు మాత్రం అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications