
Pharma-D అభ్యర్థుల ఆవేదన: నాటి వైఎస్సార్ కల - ఒక్కొక్కరిదీ ఆరేళ్ల కష్టం: పట్టించుకొనేదెవరు
ఒక్కొక్కరు ఆ పట్టా కోసం ఆరేళ్లు కష్టపడ్డారు. పది లక్షలకు పైగా ఖర్చు చేసారు. ఇప్పుడు చేతిలో పట్టా ఉంది. కానీ, ప్రభుత్వం పట్టించుకోదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న Pharma-D (డాక్టర్ ఆఫ్ ఫార్మసీ)అభ్యర్ధుల ఆవేదన పైన ప్రభుత్వం స్పందించటం లేదు. వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో ఉమ్మడి ఏపీలో ఫార్మా డీ విధానం అందబాటులోకి తీసుకొచ్చారు. సీఎంగా.. వైద్యుడిగా ఆయనకు వైద్య రంగంలో ఎవరి సేవలు ఎక్కడ సద్వినియోగం చేసుకోవాలనే అంశంపైనా పూర్తి అవగాహనతో ఒక నిర్ణయం తీసుకున్నారు. కానీ, ఇప్పుడు ఆ డిగ్రీ పూర్తి చేసిన వారు ప్రభుత్వం వైపు ఆశగా చూస్తున్నారు.


వైఎస్సార్ ముందు చూపుతో ప్రారంభం
అదే రాష్ట్ర వ్యాప్తంగా ఫార్మా డీ విధానం అందుబాటులోకి తీసుకొచ్చారు. అమెరికా పర్యటన సమయంలో అక్కడ ఎంబీబీఎస్ చేసిన వారి కంటే ఫార్మా డీ చేసిన వారి సేవల పైన పూర్తి అధ్యయనం చేసారు. వారి సేవలను ఇక్కడ సర్జరీలు మినహా..ఇతర వైద్య సేవల కోసం వినియోగించుకోవాలనే లక్ష్యంతో ప్రతీ జిల్లాలో ఫార్మా డీ కాలేజీ ప్రారంభించారు. ఫలితంగా ప్రతీ ఏడాది ప్రతీ జిల్లాలో ఫార్మా డీలో అభ్యర్ధులు అప్పటి నుంచి చేరుతూనే ఉన్నారు. మొత్తం ఆరేళ్ల పాటు ఈ కోర్సు చదవాల్సి ఉంటుంది. ఎంబీబీఎస్ - పీజీతో సమానంగా ఈ కోర్సు ద్వారా వైద్య సేవలకు అర్హత సాధించి పట్టాతో బయటకు వస్తారు. అటువంటి వారి సంఖ్య వేలల్లో ఉంది. ప్రస్తుతం ఏపీలో ప్రతీ మండలంలో రెండు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.

సేవలు వినియోగించుకోని ప్రభుత్వం
ప్రతీ కేంద్రంలోనూ ఇద్దరు ఎంబీబీఎస్ వైద్యులను నియమిస్తున్నారు. అందులో ఒకరు ఫార్మా డీ చేసిన వారికి అవకాశం కల్పించినా..వారికి ఉద్యోగం దొరుకుతుంది. అదే సమయంలో ప్రభుత్వానికి నిర్వాహణా భారం తగ్గుతుంది. సేవల పరిధి పెరుగుతుందని ఫార్మా డీ అర్హత సాధించిన అభ్యర్ధులు చెబుతున్నారు. అనేక మంది ఫార్మా డీ చేసిన వారి సేవలను ఇతర దేశాలు.. కార్పోరేట్ నగరాల్లోని రీసెర్చ్ సంస్థల్లోనూ పని చేస్తున్నారు. కానీ, వారి సేవలు ఏపీలో మాత్రం సద్వినియోగం చేసుకోవటం లేదు. చాలా మంది విదేశాలకు వెళ్లిపోతున్నారు. అనంతపురం జిల్లాలో ఈ మధ్యే ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అయితేఫార్మా డీ చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోరాదంటూ పేర్కొన్నారు. ఫార్మా డీ అర్హతతో పీహెచ్ సీల్లో పని చేయటానికి అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీనిని ఫార్మా డీ అభ్యర్ధులు తప్పు బడుతున్నారు.

ప్రభుత్వం వైపు అభ్యర్ధుల నిరీక్షణ
నాడు వైఎస్సార్ దీర్ఘ కాలిక ప్రయోజనాలను పరిగణలోకి తీసుకొని ఫార్మా డీ అందుబాటులోకి తీసుకొచ్చారని.. తాము ఆరేళ్ల పాటు చదివి - డిగ్రీ పట్టా సాధించినా..తమకు అర్హత లేదని చెప్పటం పైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాము పీజీ చేసినా నిరుపయోగంగా మారుతోందని ఆవేదన చెందుతున్నారు. తమకు అన్ని రకాలుగానూ వైద్య సేవల్లో ఎంబీబీఎస్ వారితో సమానమేనని.. సర్జరీలు చేయటానికి మాత్రం తమకు అవకాశం లేదని వారు వివరిస్తున్నారు. ఇప్పటికైనా లక్షలాది రూపాయాలు ఖర్చు చేసి..ఆరేళ్లు కష్టపడి పట్టా సాధించిన తమకు రాష్ట్రంలో పని చేసే అవకాశం కల్పించాలని ఫార్మా డీ పట్టా సాధించిన అభ్యర్ధులు కోరుతున్నారు.