ప్లాట్ ఫాం సిద్ధం చేసుకుంటున్న జగన్, దాసరితో అక్కడా ఈక్వేషన్స్ మారుతాయా?
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల క్రితం దర్శకరత్న దాసరి నారాయణ రావును కలవడం రాజకీయంగా చర్చకు తెరలేపింది. ఆయన వైసిపిలో చేరవచ్చుననే ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
దాసరిని తన వైపుకు తిప్పుకోవడం ద్వారా జగన్ కాపు సామాజిక వర్గం పైన కన్నేశారనే వాదనలు ఉన్నాయి. ప్రస్తుతం ఏపీ రాజకీయం కాపుల చుట్టూ తిరుగుతోంది.
చిరంజీవి కాంగ్రెస్ వైపు, పవన్ కళ్యాణ్ టిడిపి-బిజెపిలకు ఉన్నారు. దాసరి ద్వారా వచ్చే ఎన్నికల నాటికి మంచి ప్లాట్ ఫాం సిద్ధం చేసుకోవాలనేది జగన్ వ్యూహంగా భావిస్తున్నారు.

ఈక్వేషన్స్ చేంజ్!
జగన్ - దాసరి కలయిక ద్వారా రాజకీయ, సినీ పరిశ్రమలో ఆసక్తికర ఈక్వేషన్స్ చోటు చేసుకుంటున్నాయి. దాసరికి, చిరంజీవికి మధ్య పడదనే వాదనలు ఉన్నాయి. అయితే, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, దాసరి మధ్య మాత్రం బాగుందని చెబుతుంటారు.
పవన్ కళ్యాణ్‌తో సినిమా చేస్తానని దాసరి గతంలో చెప్పారు కూడా. దాసరి - పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో సినిమా ఉంటుందని వార్త రావడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.
అయితే, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తెలుగుదేశం - బిజెపి మద్దతుదారుగా ఉన్నారు. ఒక విధంగా ఆయన ప్రతిపక్ష నేత, వైసిపి చీఫ్ వైయస్ జగన్‌తో రాజకీయ పోరు చేస్తున్నట్లేనని అంటున్నారు.
దాసరి నారాయణ రావు ఓ వైపు పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసేందుకు సిద్ధమవుతూనే, మరోవైపు రాజకీయంగా పవన్ కళ్యాణ్ మద్దతు ఇస్తున్న టిడిపి - బిజెపిలపై పోరాడుతున్న జగన్‌ను మంచి నాయకుడిగా పేర్కొనడం గమనార్హం. అయితే, రాజకీయాలకు, సినిమాలకు సంబంధం లేకపోయినప్పటికీ.. టాలీవుడ్లో ఏమైనా ఈక్వేషన్స్ మారుతాయా అనే చర్చ కూడా సాగుతోందట.












Click it and Unblock the Notifications