ఏపీ కేడర్ ఐఎఎస్ అధికారిపై కేంద్రం కీలక నిర్ణయం..
సెంట్రల్ సర్వీసుల్లో పని చేస్తోన్న ఏపీ కేడర్ ఐఎఎస్ అధికారి గిరిధర్ అరమణె పదవీ విరమణ గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. వచ్చే ఏడాది అక్టోబర్ వరకు ఆయన కొనసాగనున్నారు.
అమరావతి: సెంట్రల్ సర్వీసుల్లో పని చేస్తోన్న ఏపీ క్యాడర్ సీనియర్ ఐఎఎస్ అధికారి గిరిధర్ అరమణె విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ప్రస్తుతం ఆయన రక్షణమంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పని చేస్తోన్నారు. 1988 బ్యాచ్- ఏపీ క్యాడర్ కు చెందిన గిరిధర్ అరమణె- ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రేసులో ఉన్నట్లు మొదట్లో వార్తలొచ్చాయి.
ఇదివరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన డాక్టర్ సమీర్ శర్మ పదవీ విరమణ సమయంలో గిరిధర్ అరమణె- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. దీనితో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా గిరిధర్ అపాయింట్ అవొచ్చనే విషయం ప్రచారంలోకి వచ్చింది. వైఎస్ జగన్ మాత్రం డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి వైపే మొగ్గు చూపారు. సెంట్రల్ సర్వీసుల్లో కొనసాగడానికే గిరిధర్ కూడా ప్రాధాన్యత ఇచ్చారప్పట్లో.

గిరిధర్ అరమణె ఏడాది కాలంగా రక్షణ మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పని చేస్తోన్నారు. గత ఏడాది నవంబర్ లో ఆయన ఈ కీలక స్థానంలో నియమితులయ్యారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆయన పదవీ విరమణ కాలాన్ని పొడిగించింది. వచ్చే ఏడాది అక్టోబర్ వరకు గిరిధర్.. ఐఎఎస్ హోదాలోనే కొనసాగుతారు. అప్పటివరకు ఆయన రక్షణ శాఖ కార్యదర్శిగానే కొనసాగుతారా? లేక స్థాన చలనం కల్పిస్తుందా? అనేది తేలాల్సి ఉంది.
తన 32 సంవత్సరాల కాలంలో గిరిధర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వివిధ కీలక శాఖల్లో పని చేశారు. చిత్తూరు, ఖమ్మం జిల్లాల కలెక్టర్ గా పని చేశారు. ఆర్థికశాఖ కార్యదర్శి, ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్, పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఆయనకు ఏపీ క్యాడర్ ను కేటాయించింది కేంద్ర ప్రభుత్వం.
కేంద్ర సర్వీసుల్లో రోడ్డు, రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేశారు. కేబినెట్ సెక్రటేరియట్ లో అదనపు కార్యదర్శిగా వ్యవహరించారు. పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ, ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీలో ఇన్ ఛార్జ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు.












Click it and Unblock the Notifications