ఏపీ మండలిలో పవన్ తొలి స్పీచ్-వైసీపీ వృథా ఎన్ని కోట్లంటే ?
ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే అసెంబ్లీలో పలుమార్లు సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన పవన్ కళ్యాణ్.. ఇవాళ తొలిసారి శాసనమండలిలో మాట్లాడారు. వైసీపీ హయాంలో చోటు చేసుకున్న అక్రమాలతో పాటు గ్రామాల్లో ఉన్న మరో సమస్యపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు పవన్ స్పందించారు.
గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ విషయంలో ఎదురవుతున్న సమస్యలపై అడిగిన ప్రశ్నకు పది గ్రామాలకు ఓ డంపింగ్ యార్డు ఏర్పాటు చేసేందుకు ప్రతీ మండలంలో స్థలాల పరిశీలన చేస్తున్నట్లు పవన్ తెలిపారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ తమ బాధ్యతని పవన్ వెల్లడించారు. అలాగే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ భవనాలకు ఆ పార్టీ రంగులు వేయడం ద్వారా రూ.4800 కోట్లు వృథా అయిన విషయం నిజమా కాదా అనే మరో ప్రశ్న కూడా ఎదురైంది. దీనికీ పవన్ జవాబు చెప్పారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో పంచాయతీ భవనాలు, ఇతర కార్యాలయాలకు రంగులు వేయడానికి రూ.4800 కోట్లు ఖర్చు చేశారన్న విషయం వాస్తవమే అని పవన్ అంగీకరించారు. 2019-24లో కేవలం గ్రామ సచివాలయాలకు రంగులు వేయడానికి 101.81 కోట్లు ఖర్చు చేశారని, ఇందులో 49.8 కోట్లు పెయింటింగ్ వేయడానికి, 52.73 కోట్లు భవనాలకు పెయింట్ తీసేసి మళ్లీ రంగులు వేయడానికి ఖర్చు చేశారన్నారు. అలాగే ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులపై హైకోర్టులో వివిధ పార్టీలు పిటిషన్లు వేశారని, హైకోర్టు ఆదేశాలతో వాటికి రంగులు మార్చినట్లు వెల్లడించారు.












Click it and Unblock the Notifications