దొంగలకు అధికారం, మోసం: చంద్రబాబుపై ధర్మాన ఫైర్
శ్రీకాకుళం: రాష్ట్ర ప్రజలు మరోసారి మోసపోయారని, దొంగల పార్టీకి అవకాశమిచ్చారని తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. శ్రీకాకుళంలో జిల్లాలోని నరసన్నపేటలో సోమవారం జరిగిన జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడారు. పాలించే దొంగలతో పాటు ఓ మీడియా కూడా వారికి సహకరిస్తోందని ఆరోపించారు.
అధికారంలోకి రావడానికి రైతులు రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు, ఆ మీడియా.. ఇప్పుడు ప్రజలు త్యాగాలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని మరో మోసానికి పాల్పడుతోందని ధర్మాన ఆరోపించారు. అధికారంలోకి వచ్చి నెలరోజులు కాకుండానే కప్పదాట్లు వేస్తున్న ప్రభుత్వ తీరును కొద్ది రోజులు వేచి చూద్దామని, ఆ తర్వాత నిలదీద్దామని అన్నారు.

గ్రామాల్లో టిడపి ఎమ్మెల్యేలు, మంత్రులు పర్యటించినప్పుడు ఎన్నికల హామీలపై నిలదీయాలని ప్రజలకు సూచించారు. ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లో తమ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం కలిగించిందని, తమకు న్యాయం చేయగలరనే విశ్వాసాన్ని ప్రజల్లో నింపిందని చెప్పారు.
కేవలం రెండు శాతం ఓట్ల తేడాతో ఓటమిపాలైనప్పటికీ.. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను సమష్టిగా పోషిస్తామని చెప్పారు. భవిష్యత్‌లో అధికారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీదేనని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కళావతి, జోగులు, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications