ఇలా వచ్చి అలా వెళ్లారు: మాట్లాడుకోని చిరు, పవన్?
హైదరాబాద్: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి, పవన్ కల్యాణ్‌ల మధ్య విభేదాలు నిజమనే ఊహాగానాలు మళ్లీ ఊపందుకున్నాయి. నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ పరిచయం సందర్భంగా విభేదాలు బయటపడ్డాయంటున్నారు.
సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన పవన్ కల్యాణ్, చిరంజీవి మాట్లాడుకోకుండా ఉండడం, మధ్యలోనే పవన్ కల్యాణ్ వెళ్లిపోవడం అభిమానుల ఊహాగానాలకు మరింత బలం చేకూర్చుతోందంటున్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం దగ్గర్నుంచి వారిద్దరి మధ్య విభేదాలు వచ్చినట్లుగా ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. అప్పటి నుండి పలు సందర్భాల్లో వారిమధ్య విభేదాలు బయటపడినట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పుడు పవన్ ఇలా వచ్చి అలా వెళ్లిపోవడం, పలకరించుకోకపోవడం చర్చనీయాంశమైంది.

కాగా, నాగబాబు తనయుడు వరుణ్ తేజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ప్రారంభోత్సవం గురువారం హైదరాబాద్‌ని రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఈ కార్యక్రమానికి మెగా స్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ పూజా హెడ్గేలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి చిరంజీవి క్లాప్ కొట్టారు.
ఈ కార్యక్రమానికి చిరంజీవితో పాటు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్ తదితరులు హాజరయ్యారు. వీరితో పాటు వివి వినాయక్, రాఘవేంద్రరావు, తదితరలు హాజరయ్యారు. లియో ఎంటర్టెన్మెంట్స్ బేనర్లో ఠాగూర్ మధు, నల్లమలుపు బుజ్జి ఈ చిత్రాన్ని ప్రొడక్షన్ నెం.1గా నిర్మిస్తున్నారు.












Click it and Unblock the Notifications