రాజకీయ రంగప్రవేశంపై దిల్ రాజు కామెంట్స్
రాజకీయాల్లో రమ్మని తనను చాలామంది అడుగుతున్నారని, అయితే, తాను ఒక స్పష్టతకు రాలేదని సినీ నిర్మాత దిల్‌రాజు వ్యాఖ్యానించారు. వేణు దర్శకత్వంలో ఆయన నిర్మించిన 'బలగం' చిత్రం ఘన విజయాన్ని అందుకుంది. ఓటీటీలో విడుదలైనా ప్రేక్షకులు ఇప్పటికీ థియేటర్లలో ఈ సినిమాను వీక్షిస్తున్నారు. అంతేకాకుండా వివిధ గ్రామాల్లో ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. మీడియాతో మాట్లాడిన బలగం నిర్మాత దిల్ రాజు రాజకీయ రంగప్రవేశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రాజకీయాల్లోకి రమ్మంటూ తనను చాలామంది అడుగుతున్నారని, అయితే ఇంతవరకు తనకే స్పష్టత లేదని, వెళ్లాలా? వద్దా? అన్న ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. తెలుగు సినిమా పరిశ్రమలోనే ఎవరైనా తనపై కామెంట్స్, విమర్శలు చేస్తే తట్టుకోలేనన్నారు. అటువంటి రాజకీయాల్లో ఎప్పుడూ విమర్శలుంటాయని, మానసికంగా అన్నింటికీ సిద్ధపడి వెళ్లాలన్నారు. అది తనవల్ల కాకపోవచ్చన్నారు. తాను చెప్పినదాంట్లోనే సమాధానం వెతుక్కోవచ్చన్నారు.

గ్రామాల్లో 'బలగం' చిత్ర ప్రదర్శనలను అడ్డుకుంటారన్న ప్రచారాన్ని కూడా దిల్ రాజు ఖండించారు. ప్రేక్షకులు ఏ రకంగా సినిమా చూసినా తమకు ఆనందమేనని, గ్రామాల్లో జరిగే ప్రదర్శనలు అడ్డుకోవడం లేదన్నారు. తమ బలగం చూసి కుటుంబాలు కలుస్తున్నాయంటే అంతకంటే అదృష్టం ఇంకేముంటుందని, డబ్బు కంటే గొప్ప సినిమా ఇచ్చామనే అనుభూతి మిగిలిందన్నారు. బహిరంగ ప్రదర్శనల వల్ల ఓటీటీ సంస్థతో న్యాయపరమైన ఇబ్బందులు ఏర్పడతాయని, వాటిని తమ సంస్థ పరిష్కరించుకుంటుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏవరైనా 'బలగం' సినిమా చూడాలనుకుంటే తామే ఏర్పాట్లు చేస్తామని దిల్ రాజు ప్రకటించారు.












Click it and Unblock the Notifications