ఆ పదవి ఖాళీ అయినప్పుడు చెప్తా: డికె అరుణ
హైదరాబాద్: తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి ఖాళీ అయినప్పుడు ఆ పదవిని తాను తీసుకుంటానా, లేదా అనే విషయంపై స్పందిస్తానని తెలంగాణ కాంగ్రెసు నాయకురాలు, మాజీ మంత్రి డికె అరుణ అన్నారు. సమర్థ నాయకత్వం లేకపోవడం వల్లనే తాము ఎన్నికల్లో ఓడిపోయామని ఆమె గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
ముఖ్యమంత్రి అభ్యర్థిగా సీనియర్ నాయకుడిని ముందుకు తెచ్చి ఉంటే కాంగ్రెసు అధికారంలోకి వచ్చి ఉండేదేమోనని ఆమె అన్నారు. కాంగ్రెసును ఎందుకు ఓడించామా అని ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. నాయకత్వ సమన్వయలోపం వల్లనే తాము ఓడిపోయామని ఆమె అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధికారంలోకి వచ్చి రెండు నెలలు అవుతున్నా ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదని ఆమె విమర్శించారు. హామీలపై స్ఫష్టమైన కార్యాచరణ కూడా ప్రభుత్వం ప్రకటించలేదని అరుణ అన్నారు. ఇప్పటికైనా తెరాస ప్రభుత్వం ఎన్నికల హామీల అమలుపై దృష్టి పెట్టాలని ఆమె హితవు పలికారు.












Click it and Unblock the Notifications