ఎబోలా భయం లేదు, లేదనే రిపోర్ట్ వస్తుంది: టెక్కీ అంశంపై గాంధీ వైద్యులు
హైదరాబాద్: ఎబోలా వ్యాధి పట్ల ప్రజలు భయపడవల్సిన పని లేదని హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రి వైద్యులు మంగళవారం చెప్పారు. స్వైన్ ఫ్లూ లేదా ఎబోలా వ్యాధి లక్షణాలతో ఉన్న వ్యక్తి గాంధీ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. రోగి పరిస్థితి పైన వైద్యులు వివరాలు తెలిపారు.
రోగి నుండి సేకరించిన రక్తాన్ని పరీక్షల నిమిత్తం ఢిల్లీకి పంపించామని తెలిపారు. సాయంత్రానికి రోగికి సంబంధించిన నివేదిక వస్తుందన్నారు. ఎబోలా వ్యాధి లేదనే నివేదిక వస్తుందని తెలిపారు. నైజీరియా నుండి వచ్చినందున రోగి నుండి రక్తనమూనాలు సేకరించామన్నారు. ప్రజల్లో భయాందోళనలు సృష్టించవద్దన్నారు. స్వైన్ ఫ్లూను పూర్తిస్థాయిలో నియంత్రించినట్లు చెప్పారు. మంత్రి రాజయ్య కూడా ఎబోలా భయం లేదన్నారు.

కాగా, శ్రీనగర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తి అనుమానిత వైరస్‌తో మహాత్మా గాంధీ ఆసుపత్రిలో నాలుగు రోజులుగా చికిత్స పొందుతున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కొంతకాలంగా నైజీరియాలో పని చేసిన ఆయన ఇటీవలె హైదరాబాద్ వచ్చారు. ఇంట్లో ఉండగా తీవ్ర జ్వరం రావడంతో నగరంలోని ఓ కార్పోరేట్ ఆసుపత్రిలో గత నెల 24వ తేదీన చేరారు.
అక్కడ రెండు రోజులు చికిత్స తీసుకున్నప్పటికీ నయం కాలేదు. దీంతో ఆయనకు స్వైన్ ఫ్లూ లేదా ఎబోలా లక్షణాలు ఉండవచ్చునని భావించి, అక్కడి నుండి గాంధీ ఆసుపత్రికి తరలించారు. రోగి రక్త నమూనాలను ఢిల్లీకి పంపించారు. ఎబోలా నోడల్ కేంద్రం వైద్యులు రోగి రక్తనమూనాలను, ముక్కు స్రావాలను సేకరించి ఢిల్లీలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు.
బాధితుడు 40 ఏళ్ల వ్యక్తి. నైజీరియాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అతను నవంబర్ 21న నైజీరియా నుంచి ముంబైకి వచ్చాడు. అక్కడ నుంచి హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీకి చేరుకున్నాక విపరీతంగా జ్వరం, ఆయాసం, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలు రావడంతో ఆసుపత్రిలో చేరారు.












Click it and Unblock the Notifications