తాడికొండలో అసలేం జరుగుతోందంటే: డొక్కా
తాడికొండ నియోజకవర్గంలో రాజకీయాలన్నీ వాటికవే సర్దుకుంటాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. పేరేచర్లలోని కైలాసగిరి శివాలయాన్ని సందర్శించిన డొక్కా స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ఆధ్వర్యంలో తాను కూడా పనిచేస్తానన్నారు. ఆమె తండ్రి, సోదరులు గతంలో తనతోనే కలిసి పనిచేశారని వివరించారు. ఎట్టిపరిస్థితుల్లోను ఆమెకు అన్యాయం జరగదని, ఆమె రాజకీయ భవిష్యత్తు గురించి ముఖ్యమంత్రి జగన్ చూసుకుంటారన్నారు.
ఎమ్మెల్యే శ్రీదేవితో ఎటువంటి ఇబ్బంది లేదని, తప్పుడు పనులు చేసేవారు కొందరు ఆమెను తప్పుదోవ పట్టిస్తున్నారనే అభిప్రాయాన్ని డొక్కా వ్యక్తం చేశారు. త్వరలోనే ఎమ్మెల్యే శ్రీదేవితో కలిసి ముఖ్యమంత్రిని కలుస్తానన్నారు. తనకు రాజకీయ గురువు రాయపాటి సాంబశివరావు అని, ఆయన్ని ఎప్పటికీ గౌరవిస్తానన్నారు. ప్రస్తుతం తనకు సీఎం జగన్ బాస్ అని, ఆయన ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తానని డొక్కా స్పష్టం చేశారు.

తాడికొండ నియోజకవర్గానికి అదనపు సమన్వయకర్తగా సీఎం డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను నియమించారు. అప్పటి నుంచి డొక్కా వర్గం, శ్రీదేవి వర్గం మధ్య విభేదాలు రుగులుతున్నాయి. రానున్న ఎన్నికల్లో ఉండవల్లి శ్రీదేవికి సీటుండదని, అందుకే డొక్కాను ప్రత్యేకంగా నియమించారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య వివాదాలు నెలకొనడంతో త్వరలోనే వీరిని పిలిచి మాట్లాడాలని వైసీపీ అధిష్టానం భావిస్తోంది.












Click it and Unblock the Notifications