ట్విస్ట్.. జగన్, చిరంజీవి ఎఫెక్ట్: దాసరిపై పవన్ కళ్యాణ్ రివర్స్ గేర్?
విజయవాడ/హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో దర్శకరత్న దాసరి నారాయణ రావు చిత్రం ఉంటుందా? అనే చర్చ సాగుతోంది. దాసరిని వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కలవడం, ప్రశంసించడం, ఆ తర్వాత చిరంజీవి - పవన్ కళ్యాణ్ ఒక్కటి కావడం తెలిసిందే.
ఈ నేపథ్యంలో దాసరి - పవన్ కళ్యాణ్ చిత్రం పట్టాలెక్కే విషయం అనుమానమేననే వాదనలు వినిపిస్తున్నాయి. సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో విడుదలకు ముందు... పవన్ కళ్యాణ్, చిరంజీవిలు ఒకే వేదిక పైన కనిపించక కొన్నేళ్లవుతోంది.
మెగా హీరోల ప్రతి సినిమా ఫంక్షన్లో అభిమానులు పవన్ కళ్యాణ్‌ను పలవరించేవారు. ఓ సమయంలో మెగా సోదరుడు నాగబాబు మాట్లాడుతూ.. అతను రాడని ఆవేశంగా చెప్పారు. దీంతో చిరు, పవన్‌లది రాజకీయంగా వేరు దారి అయినప్పటికీ... కలుసుకునేందుకు సిద్ధంగా లేరనే వాదనలు వినిపించాయి.
చిరు, పవన్ మధ్య దూరం పెరిగిందనే వార్తల సమయంలోనే దర్శకరత్న దాసరి - పవన్ కళ్యాణ్ సినిమా వెలుగులోకి వచ్చింది. పవన్ హీరోగా దాసరి సినిమా తీస్తానని చెప్పారు. దానికి పవర్ స్టార్ కూడా ఓకే చెప్పారు. ఆయితే, ఆ తర్వాతే అంతా రివర్స్ అయినట్లుగా తెలుస్తోంది.

కొద్ది రోజుల క్రితం వైయస్ జగన్ దర్శకరత్న దాసరిని కలిశారు. తన పార్టీలోకి ఆహ్వానించారు. వైసిపిలో చేరకపోయినప్పటికీ.. దాసరి మాత్రం జగన్‌ను ఆకాశానికెత్తారు.
ఆ తర్వాత ఇటీవలే, సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో వేడుక సాక్షిగా చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ల మధ్య విభేదాలు లేవని తేలిపోయాయి. అదే సమయంలో రాజకీయాల విషయంలో మరింత స్పష్టత ఇచ్చారు. తమ ఇద్దరి మధ్య రాజకీయదారులే వేరని, కుటుంబం మాత్రం ఒక్కటేనని చెప్పుకొచ్చారు.
దాసరిని జగన్ కలవడం, చిరు - పవన్ ఒక్కటి అయిన నేపథ్యంలో దాసరి - పవన్‌ల చిత్రంపై అనుమాన మేఘాలు కమ్ముకున్నాయని అంటున్నారు. అంతేకాదు, దాసరి నుంచి పవన్ అడ్వాన్సు తీసుకున్నారని, అది కూడా తిరిగిచ్చే యోచనలో ఉన్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications