పెళ్లికాక ముందే వరకట్న వేధింపులు: కిరోసిన్ పోసుకుని వధువు ఆత్మహత్య
వరంగల్: వివాహం జరుగకముందే వరుడు కుటుంబం నుంచి వరకట్న వేధింపులు రావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ వధువు కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ శనివారం ఉదయం ప్రాణాలు విడిచింది.
వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లాలోని ఆత్మకూరుకు చెందిన రోజారాణికి సుదర్శన్ అనే యువకుడికి కొద్ది రోజుల క్రితం నిశ్చితార్థం జరిగింది. కాగా, వివాహం 12 రోజులుందనగా తమకు వరకట్నం పూర్తిగా ఇప్పుడే చెల్లించాలని వరుడు కుటుంబం పట్టుబట్టింది.
రూ. 12లక్షలు వివాహ కట్నంగా మాట్లాడుతకున్న యువతి కుటుంబసభ్యులు ఇప్పటికే రూ. 4 లక్షలను వరుడు కుటుంబానికి అందజేశారు. మిగితాది వివాహం తర్వాత ఇస్తామని చెప్పారు. అయితే తమకు ఇప్పుడు ఆ మొత్తం కూడా కావాలని.. లేదంటే వివాహాన్ని రద్దు చేస్తామని వరుడి కుటుంబసభ్యులు బెదిరింపులకు పాల్పడ్డారు.

దీంతో తమ కుటుంబ పరువు పోతుందని భావించిన రోజారాణి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. తీవ్ర గాయాలపాలైన ఆమెను ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ ఆమె శనివారం ఉదయం మృతి చెందింది. దీంతో ఆమె కుటుంబంలో విషాదంలో మునిగిపోయింది.
తమ కూతురుకు మరణానికి కారణమైన వరుడు కుటుంబసభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, వరుడు పరారీలో ఉన్నట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న మహిళా సంఘాలు బాధిత కుటుంబానికి మద్దతుగా ఆందోళన చేపట్టారు. యువతి మృతికి కారణమైన వరుడి కుటుంబసభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications