విశాఖపట్నంలో భూకంపం.. భయంతో ఇళ్ల నుంచి బయటికి జనం పరుగులు !!
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం నగరంలో భూకంపం సంభవించింది. ఈరోజు ( 4-11-2025 ) తెల్లవారుజామున ఉదయం 4:16 నుంచి 4:20 గంటల మధ్య భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే చాలామంది గాఢ నిద్రలో ఉండగా అకస్మాత్తుగా ఈ ఘటన చోటు చేసుకోవడంతో.. కుటుంబ సభ్యులతో కలిసి ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.
కాగా భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.7గా నమోదైనట్లు జాతీయ భూకంప పరిశోధనా కేంద్రం (NCS) వెల్లడించింది. భూమి లోపల 10 కిలోమీటర్ల లోతులో కేంద్ర బిందువు (epicentre) నమోదైనట్లు తేలింది. ఈ కేంద్రం అల్లూరి సీతారామరాజు జిల్లా జీ.మాడుగుల ప్రాంతంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

ప్రభావిత ప్రాంతాలు..
- విశాఖ నగరంలోని గాజువాక, మధురవాడ, రిషికొండ, భీమిలి, మహారాణిపేట, కైలాసపురం, విశాలాక్షినగర్, రాంనగర్, మురళీనగర్, అక్కయ్యపాలెం
- కొంత మేరకు గాజువాక సమీప తీరప్రాంతాలు, భీమ్‌లిపట్నం మండల పరిసర గ్రామాలు
ఇక కొంతమంది తమ మొబైళ్లలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. సెకన్ల వ్యవధిలోనే ప్రకంపనలు ఆగిపోయినా కానీ భయం మాత్రం గంటల తరబడి కొనసాగింది. స్థానిక పోలీసు, ఫైర్ సిబ్బంది కొన్ని ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితులను పరిశీలించారు. ఇది స్వల్ప తీవ్రత గల భూకంపం కావడంతో పెద్ద ప్రమాదం ఏదీ జరగలేదని.. ప్రజలు భయపడవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications