ఏపీలో ఓట్లపై వైసీపీ వర్సెస్ టీడీపీ పోరు-ఈసీ కీలక నిర్ణయం..!
ఏపీలో గతంలో ఎన్నడూ లేనంత స్ధాయిలో ఓటర్ల జాబితా వివాదాస్పదమైంది. ముఖ్యంగా ఓటర్ల నమోదు, తొలగింపుల విషయంలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీ మధ్య తీవ్ర పోరు నెలకొంది. వీరిద్దరూ పరస్పర ఫిర్యాదులతో ఈసీ వద్దకు పదే పదే క్యూ కడుతున్నారు. దీంతో ఈసారి తుది ఓటర్ల జాబితాపై ఉత్కంఠ నెలకొంది. వచ్చే నెల 5వ తేదీ నాటికి తుది ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని ఈసీ డెడ్ లైన్ పెట్టుకున్నా వీరిద్దరి ఫిర్యాదుల నేపథ్యంలో అది కాస్తా పొడిగించక తప్పని పరిస్దితి నెలకొంది.
దీంతో ఎన్నికల సంఘం ఏపీ ఓటర్ల జాబితా లో సవరణలకు గడువు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో నమోదు, తొలగింపులు, సవరణల కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. దీంతో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ఓటర్ల జాబితా తయారీ గడువు పొడిగించాలని ఈసీని కోరారు. ఈ వినతిని పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలో సవరణలకు ఇచ్చిన గడువును వచ్చే నెల 22 వరకూ పెంచుతూ కీలక నిర్ణయం ప్రకటించింది.

ఏపీతో పాటు ఆరు రాష్ట్రాలకు వచ్చే నెల 5న ఓటర్ల తుది జాబితా ప్రకటించాల్సి ఉండగా.. ఇప్పుడు రాష్ట్రంలో నెలకొన్న పరిస్దితులతో అది కాస్తా జనవరి 22కు మారిపోయింది. ఈ మేరకు ఈ ఆరు రాష్ట్రాల సీఈవోలకు ఈసీ సమాచారం ఇచ్చింది.
జనవరి 22 కల్లా ఓటర్ల తుది జాబితా సిద్ధమైతే ఆ తర్వాత ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ఈసీ ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో పర్యటించిన ఈసీ బృందం ఇక్కడి పరిస్ధితులను అంచనా వేసుకుంది. ఇప్పుడు ఓటర్ల తుది జాబితా కూడా సిద్ధమైతే తప్ప తదుపరి ఏర్పాట్లు చేసేందుకు వీలు లేదు. ఈ నేపథ్యంలో ఈసీ గడువు పెంపు కీలకంగా మారింది.












Click it and Unblock the Notifications