శోభ మృతి: లేని గుర్తింపు, ఆళ్లగడ్డ ఎన్నిక యథాతథం
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆళ్లగడ్డ అసెంబ్లీ అభ్యర్థి శోభా నాగిరెడ్డి మృతి నేపథ్యంలో ఆళ్లగడ్డ ఎన్నిక పైన డైలమా ఏర్పడిన విషయం తెలిసిందే. దీనిపై ఉత్కంఠకు ఎన్నికల సంఘం తెర దించింది. ఆళ్లగడ్డ ఎన్నికలు యథాతథంగా జరుగుతాయని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఈసి నిబంధన ప్రకారం గుర్తింపు లేని పార్టీ అభ్యర్థి మరణించినా ఎన్నికలు యథాతథంగా జరపవచ్చునని తెలుస్తోంది. ఆళ్లగడ్డలో ఎన్నికలు యథాతథంగా ఉంటాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఈసి సమాచారం ఇచ్చింది.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రిజిస్టర్ అయిన పార్టీయే తప్ప గుర్తింపు పొందిన పార్టీ కాదు. ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయినా ఎన్నికలు జరుగుతాయని ఈసి తెలిపింది. గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థి చనిపోతేనే ఎన్నిక వాయిదా ఉంటుందని, ఈవిఎం నుంచి అభ్యర్థి పేరు తొలగించే అవకాశం ఉందని ఎన్నికల సంఘం పేర్కొంది.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్ నుంచి కూడా ఒక నివేదిక కోరుతున్నామని ఈసి పేర్కొంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు కూడా దీనిపై ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలని భావిస్తున్నారు. జగన్ పార్టీ ఇచ్చే రిప్రజెంటేషన్, తర్వాత ఇక్కడి నియమనిబంధనావళిని చూసుకుని ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్నదానిపై ఈసి చూస్తుంది. ఎన్నికలు జరిగేటప్పుడు ఈవిఎంలో శోభా నాగిరెడ్డి పేరు, పార్టీ గుర్తును తొలగించనున్నట్లు ఈసి తెలిపింది.
కాగా, ప్రధాన ఎన్నికల కమిషనర్ భన్వర్ లాల్ మాట్లాడుతూ... శోభా నాగిరెడ్డి మృతిపై తమకు కలెక్టర్ నుండి నివేదిక రావాల్సి ఉందని చెప్పారు. దానిని తాము ఈసికి పంపిస్తామన్నారు. మరోవైపు లెజెండ్ సినిమా ఫిర్యాదుపై స్పందిస్తూ... సినిమాను అధికారులు చూశారని, రిపోర్టులు వచ్చాక నిర్ణయం ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications