తిరుపతిలో ఐదుగురు పోలీసు ఉన్నతాధికారులపై బదిలీ వేటు
తిరుపతి: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానున్న వేళ మరికొందరు పోలీసు అధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి, అధికార పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న పలువురు ఉన్నతాధికారులపై ఇప్పటికే చర్యలు తీసుకున్న ఎన్నికల సంఘం తాజాగా మరో ఐదుగురు సీఐలపై చర్యలు తీసుకుంది.
తిరుపతికి చెందిన సీఐలను అనంతపురం జిల్లాకు బదిలీ చేసింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో సీఐలు జగన్మోహన్ రెడ్డి, అంజూయాదవ్, అమర్నాథ్ రెడ్డి, శ్రీనివాసులు, వినోద్ కుమార్ లను అనంతపురంలో ఎన్నికల విధులు నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.

సాయుధ బలగాలను పెంచండి: ఈసీని కలిసిన కూటమి నేతలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, పలు ప్రాంతాల్లో పోలింగ్ నిర్వాహణకు భద్రత పెంచాలంటూ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నేతలు ఏపీ ఈసీ, సీఐఓ ముఖేష్ కుమార్ మీనాను కలిశారు. ఆయా ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లల్లో లోపాలపై చర్యలు చేపట్టాలని వినతి పత్రం ఇచ్చారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఎన్నికల నిర్వాహణలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని, ప్రత్యేక బలగాలను కేటాయించాలని కూటమి నేతలు కోరారు.
రాయలసీమ జిల్లాల్లోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సాయుధ బలగాలను పెంచాలని కూటమి నేతలు కోరారు. రాయలసీమలోని ధర్మవరం, జమ్మలమడుగు, బద్వేల్ నియోజకవర్గాలు సమస్యాత్మకంగా ఉన్నాయని తెలిపారు. వీటిని క్రిటికల్ సెన్సిటివ్ నియోజకవర్గాలుగా ఇప్పటికే గుర్తించారన్నారు.
ధర్మవరం కూటమి అభ్యర్ధి సత్యకుమార్ మరిన్ని కేంద్ర బలగాలను మోహరించాలని హైకోర్టులో కేసు వేశారని బీజేపీ నేత సాధినేని యామినీ శర్మ తెలిపారు. కోర్టు తీర్పు సారాంశాన్ని ఎన్నికల ప్రధానాధికారికి నివేదించామన్నారు. రాయలసీమలో ఇబ్బంది ఉందనే ప్రశాంతంగా పోలింగ్ జరిగేందుకు భద్రత పెంచాలని కోరినట్లు బీజేపీ నేతలు వెల్లడించారు. భద్రత పెంచే విషయంపై డీజీపీకి కూడా విజ్ఞాపన పత్రం ఇచ్చామని తెలిపారు.












Click it and Unblock the Notifications