భక్తులకు టీటీడీ చక్కటి అవకాశం: రూ.500లతో
ఈ నెల 20వ తేదీన దీపావళి. 22వ తేదీ నుంచి పవిత్ర కార్తీకమాసం ఆరంభమౌతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో శైవక్షేత్రాలు భక్తులతో పోటెత్తుతుంటాయి. శివనామస్మరణతో మార్మోగుతుంటాయి. అయ్యప్ప స్వామి దీక్షాధారణలు మరింత ఊపందుకుంటాయి ఈ కార్తీక మాసంలో. నెల రోజుల పాటు ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంటుంది.
కార్తీక మాసాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో నెల రోజుల పాటు ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ నెల 22వ తేదీన కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. శాస్త్రోక్తంగా అంకురార్పణ జరుగనుంది. నవంబర్ 20వ తేదీ వరకు ఇవి కొనసాగుతాయి. కపిలేశ్వర స్వామివారివారికి ఈ నెల రోజుల పాటు విశేషపూజలను నిర్వహిస్తారు. లోక కల్యాణం కోసం హోమాలు చేస్తారు అర్చకులు.

22 నుంచి 23వ తేదీ వరకు శ్రీగణపతిస్వామివారి హోమం ఉంటుది. 24 నుండి 26 వరకు శ్రీసుబ్రమణ్యస్వామి, 27న శ్రీదక్షిణామూర్తి, 28న శ్రీనవగ్రహ హోమం జరుగనున్నాయి. 29న శ్రీకాలభైరవ స్వామివారి హోమం నిర్వహిస్తారు. 30 నుంచి నవంబరు 7వ తేదీ వరకు శ్రీ కామాక్షి అమ్మవారి హోమం (చండీహోమం), నవంబరు 8 నుంచి 18వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వర స్వామివారి హోమం (రుద్రహోమం) వైభవంగా జరుపుతారు.
నవంబరు 19న ధర్మశాస్త్ర హోమం, నవంబరు 20న శ్రీచండికేశ్వరస్వామివారి హోమం, త్రిశూలస్నానం, పంచమూర్తుల తిరువీధి ఉత్సవం నిర్వహించనున్నారు. సాధారణ భక్తులు ఇందులో పాల్గొనవచ్చు. గృహస్తులు (ఇద్దరు) రూ.500 చెల్లించి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. వారికి ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు. ఈ హోమాల్లో పాల్గొనే గృహస్తులు కచ్చితంగా సంప్రదాయ వస్త్రధారణలో రావాల్సి ఉంటుంది.
ఈ హోమాల్లో భాగంగా అక్టోబరు 27న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్యస్వామివారి కల్యాణం, నవంబరు 18న మాస శివరాత్రి నాడు శ్రీ శివపార్వతుల కల్యాణోత్సవం జరుగనున్నాయి. రూ. 500 చెల్లించి ఇందులో కూడా గృహస్తులు పాల్గొనవచ్చు. కపిలతీర్థం ఆలయంలో టీటీడీ నిర్వహిస్తున్న హోమ మహోత్సవాలకు భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. 2012లో టీటీడీ వీటిని ప్రారంభించింది. ఇందులో పాల్గొనే భక్తుల సంఖ్య ప్రతి ఏడాదీ పెరుగుతోంది.












Click it and Unblock the Notifications