27న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం - పీఆర్సీ రిపోర్టు ఇవ్వాలి : నెలాఖరులోగా ప్రకటన చేస్తారా..!!
ఈ నెల 27న ఏపీ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ (రాష్ట్ర స్థాయి) సమావేశం జరగనుంది. 15ఏళ్లుగా నిలిచిపోయిన ఏపీ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం తిరిగి జరుగుతుండటంతో ప్రాధాన్యత ఏర్పడింది. ఈ కౌన్సిల్ కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఛైర్మన్ గా ఉంటారు. 27న సమావేశం ఏర్పాటు చేసినట్లుగా సాధారణ పరిపాలనా శాఖ మెమో జారీ చేసింది. ఈ సమావేవ:లో చర్చించాలని అంశాలకు సంబంధించిన జాబితా ఇవ్వటంతో..వాటికి సంబంధించి రిమార్కులను పంపాలని సూచించింది. ఈ సమావేశానికి అన్ని ఉద్యోగ సంఘాలను ఆహ్వానిస్తున్నారు.

అన్ని ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం
ప్రతీ సంఘం నుంచి అధ్యక్ష - ప్రధాన కార్యదర్శులు హాజరు కావాలని ప్రభుత్వం పేర్కొంది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో ఆర్దికపరమైన అంశాల పైన పట్టు పడతామని ఏపీ గవర్నమెంట్ ఎంపాయిలస్ అసోసియేషన్ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే సీఎస్ ను కలిసిన ఉద్యోగ సంఘాల నేతలు 30 డిమాండ్ల జాబితాను అందచేసారు. అయితే, ఇదే సమయంలో ఇప్పటికే ప్రభుత్వానికి చేరిన 11వ పీఆర్సీ నివేదికను ఈ సమావేశానికి ముందుగానే ఉద్యోగ సంఘాలకు ఇవ్వాలని ఏపీ జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. వీరు గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి వినతి పత్రాన్ని అందించారు.

అన్నీ పరిష్కరిస్తామని సీఎస్ హామీ
ఆ సమయంలో సీఎస్ నుంచి అన్ని సమస్యలు చర్చించి పరిష్కరించుకుందామంటూ సానుకూల సమాధానం వచ్చింది. సీఎస్ నిర్వహించిన అన్ని శాఖల కార్యదర్శుల సమావేశంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలో కోవిడ్‌తో చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన కారుణ్య నియామకాలను నవంబర్ 30లోగా పూర్తి చేయాలని స్పష్టం చేసారు. ఇక, దసరా సమయంలో ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమైన సమయంలో ప్రభుత్వ సలహాదారు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ పైన ఈ నెలాఖరులోగా నిర్ణయం తీసుకుంటామని..దీని పైన సీఎస్ ఉద్యోగ సంఘాలతో చర్చలు చేస్తారని చెప్పారు.

పీఆర్సీ పైన నెలాఖరులోగా నిర్ణయం జరిగేనా
ఈ నెల 18 లేదా 19 తేదీల్లోనే ఈ మేరకు చర్చలు ఉండే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాల నేతలు అంచనా వేసారు. కానీ, పీఆర్సీ పైన చర్చలకు ఎటువంటి ఆహ్వానం అందలేదు. ఇదే సమయంలో ఈ నెల 27న ఏపీ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసారు. ఇందులో పీఆర్సీ పైన చర్చ జరిగే అవకాశం పైన ఇంకా స్పష్టత రాలేదు. పీఆర్సీతో పాటుగా పెండింగ్ డీఏల పైన ఉద్యోగులు ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన కోసం వేచి చూస్తున్నారు. అదే విధంగా ప్రతీ నెలా ఒకటో తేదీన జీతాలు.. పెన్షన్లు అందేలా చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.
Recommended Video

ప్రభుత్వం పైన పెరుగుతున్న ఒత్తిడి
దీనికి సైతం హామీ లభించింది. తెలంగాణలో ఇప్పటికే పీఆర్సీ అమలు చేస్తున్న పరిస్థితుల్లో ప్రభుత్వం పైన ఉద్యోగ సంఘాల ఒత్తిడి పెరుగుతోంది. ప్రభుత్వం ఇప్పటికే ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి జగన్ సచివాలయానికి వచ్చిన తొలి రోజునే ఐఆర్ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. పీఆర్సీ పైన సీఎస్ చర్చలు చేయాల్సి ఉండటంతో..ఉద్యోగ సంఘాల నేతలు ఆయనతో సమావేశమవ్వగా ..అన్నీ చర్చిద్దామని సీఎస్ హామీ ఇచ్చారు. అయితే, ఈ నెలాఖరులోగా ముందుగా చెప్పినట్లుగా పీఆర్సీ పైన నిర్ణయం ఉంటుందా లేదా అనేది ఇప్పుడు ఉద్యోగుల్లో చర్చకు కారణమవుతోంది.












Click it and Unblock the Notifications