తిరుపతి జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్టు అమలు: నెల రోజులపాటు
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలో తాజాగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 పోలీసు యాక్టు అమల్లో ఉందని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో గత కొన్ని రోజులుగా తిరుమల తిరుపతి తదితర ప్రాంతాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి.
శాంతిభద్రతల పరిరక్షణ భాగంగా నెల రోజులపాటు అంటే అక్టోబర్ 24 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. పోలీసు శాఖ నుంచి అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించొద్దని ఆంక్షలు విధించారు. అయితే, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ సుబ్బారాయుడు హెచ్చరించారు.

తిరుపతి లడ్డూకి పెరిగిన డిమాండ్
తిరుమల పుణ్యక్షేత్రంలో ఇప్పుడు నాణ్యమైన లడ్డూలను తయారు చేస్తున్నారు. దీంతో దేవాలయానికి వచ్చే భక్తులు తిరుపతి లడ్డూలను పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తుండటం గమనార్హం. ఈ వారం రోజుల్లో 23 లక్షల 13 వేల 202 లడ్డూలను భక్తులు కొనుగోలు చేశారు.
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత తిరుమలలో గత ప్రభుత్వ చేసిన తప్పిదాలను సరి చేసింది. శ్రీవారి ప్రసాదాలలో కేవలం స్వచ్ఛమైన ఆవు నెయ్యి మాత్రమే వాడేలా కఠిన చర్యలు తీసుకుంది. దీంతో స్వచ్ఛమైన ఆవు నెయ్యి వాడకంతో శ్రీవారి లడ్డూలు రుచికరంగా మారాయి. రోజుకు 3.2 లక్షల లడ్డూలను శ్రీవారి భక్తులు కొంటున్నారు.
స్వచ్ఛత, నాణ్యతకు తిరుమల తిరుపతి లడ్డూ పెట్టింది పేరు. భక్తులు ఎంతో పవిత్రంగానూ భావించే తిరుపతి లడ్డూలో కొన్నాళ్లుగా నాణ్యత లోపించిందనేది వాస్తవం అంటున్న భక్తులు, కూటమి ప్రభుత్వం వచ్చాక భోజనంలోనూ గణనీయమై మార్పులు వచ్చాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రసాదాల్లో నాణ్యత పెరిగిందని, శ్రీవారి అన్న ప్రసాదం రుచిగా ఉందని చెప్తున్నారు.












Click it and Unblock the Notifications