బంగారం ధరలు తగ్గుతున్నా .. కొనేందుకు ఆసక్తి చూపని జనాలు.. ఎందుకంటే!!
అంతర్జాతీయంగా ఉన్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్న విషయం తెలిసిందే . అయితే గత పది రోజులుగా మాత్రం బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. గత నాలుగు నెలలుగా గమనించినట్లయితే 10 గ్రాముల బంగారం ధర 63 వేల 500 వరకూ పెరిగి ప్రస్తుతం కిందికి దిగింది. ప్రస్తుతం మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 60 వేల 300 రూపాయలుగా ఉంది.
బంగారం అమ్మకాలు కూడా తగ్గుముఖం పట్టడంతో బంగారు ఆభరణాలను విక్రయించే గోల్డ్ షాప్ యజమానులు లబోదిబోమంటున్నారు. ప్రస్తుతం ధరలు తగ్గినా అమ్మకాలు లేకపోవడంతో తెలుగు రాష్ట్రాలలో బులియన్ మార్కెట్ కళ తప్పుతోంది. ఆషాడ మాసం కావడం, ముహూర్తాలు లేకపోవడం వంటి కారణాలు కూడా బంగారం కొనుగోలు చేయకపోవడం వెనుక ప్రధానంగా కనిపిస్తున్నాయి.

ఆర్థిక మాంద్యం, బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచడం, ఉత్పత్తి పెరగడం తదితర కారణాలతో బంగారంపై పెట్టుబడులు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం బంగారానికి సంబంధించి ఇన్సైడ్ ట్రేడింగ్ మాత్రమే ఎక్కువగా సాగుతుందని తెలుస్తుంది. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి బంగారం ధరలు ఆకాశాన్ని తాకడంతో చాలామంది బంగారం ప్రియులు బంగారం కొనుగోలుపై ఆశలు వదిలేసుకున్నారు.
ఇక బంగారం స్థానంలో వెండి పైన బంగారం పూత పూసిన అమ్ముతున్న ఆభరణాలను, వన్ గ్రామ్ జ్యువెలరీ ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. చాలామంది వివాహాది శుభకార్యాలకు కూడా ఈ ఆభరణాలను వినియోగిస్తున్న క్రమంలో బంగారం కొనుగోళ్ళు కూడా బాగా తగ్గాయి అని చెప్పవచ్చు.

విక్రయాలు తగ్గడంతో గత ఆర్థిక సంవత్సరం తో పోలిస్తే ఈ సంవత్సరం బంగారం కొనుగోళ్లపై ప్రభుత్వానికి వచ్చే జిఎస్టి ఆదాయం కూడా బాగానే తగ్గుతుందని తెలుస్తుంది. బాగా పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, కూరగాయల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో అష్టకష్టాలు పడుతున్నారు. ఈ క్రమంలో వారు బంగారం కొనుగోలుకు ఆసక్తి చూపించడం లేదు.












Click it and Unblock the Notifications