ఏపీ, ఢిల్లీ, బీహార్‌లలో ఈవెనింగ్ కోర్టులు.. కేంద్రం తగ్గట్లేదుగా!
భారతీయ న్యాయ వ్యవస్థలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంటున్న కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు కిందిస్థాయి కోర్టులపై పనిభారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా దేశంలోని కొన్ని ఎంపిక చేసిన రాష్ట్రాల్లో 'ఈవెనింగ్ కోర్టుల నిర్వహణకు సన్నాహాలు చేస్తోంది.
ఈ ప్రత్యేక ఈవెనింగ్ కోర్టుల ఏర్పాటుకు సంబంధించి కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ఇటీవల ఒక ఇంటర్యూలో కీలక వివరాలను వెల్లడించారు. ప్రాథమిక దశలో భాగంగా పైలట్ ప్రాజెక్ట్ కింద ఆంధ్రప్రదేశ్ , ఢిల్లీ, బిహార్ రాష్ట్రాల్లో ఈవెనింగ్ కోర్టులను ప్రవేశపెట్టనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

సాధారణంగా కోర్టులు పగటిపూట నిర్దిష్ట సమయాల్లో మాత్రమే పనిచేస్తుంటాయి. అయితే ఈ నిబంధనను మారుస్తూ.. కోర్టుల పనివేళలను సాయంత్రం పూట మరో కొన్ని గంటల పాటు పొడిగించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ అదనపు వేళల్లో కేవలం దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సివిల్, క్రిమినల్ కేసులను మాత్రమే ప్రత్యేకంగా విచారించేలా తగిన నిబంధనలు తీసుకురానున్నారు. దీనివల్ల కొత్త కేసుల విచారణకు ఎలాంటి అంతరాయం కలగకుండా పాత కేసులు వేగంగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఉన్న జ్యుడీషియరీ సిబ్బందిపై పనిభారం మరింత పెరగకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక చక్కటి ప్రత్యామ్నాయాన్ని యోచిస్తోంది. ఈ ఈవెనింగ్ కోర్టుల నిర్వహణ బాధ్యతలు, కేసుల విచారణ కోసం అనుభవజ్ఞులైన రిటైర్డ్ న్యాయమూర్తుల సేవలను వినియోగించుకోవాలని భావిస్తున్నారు. దీనివల్ల న్యాయపరమైన అనుభవం పూర్తిగా ఉపయోగపడటంతో పాటు త్వరగా తీర్పులు వెలువడే అవకాశం ఉంటుంది.
ఆయా రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల హైకోర్టుల పూర్తి సమన్వయం, సహకారంతోనే ఈ ఈవెనింగ్ కోర్టులను గ్రౌండ్ లెవెల్‌లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. తొలి విడతలో చేపట్టే ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైన తీరును, ఫలితాలను క్షుణ్ణంగా విశ్లేషించిన తర్వాత.. దేశంలోని మిగతా రాష్ట్రాలకు కూడా దీన్ని విస్తరించేలా చర్యలు తీసుకోనున్నారు.
కేవలం ఈవెనింగ్ కోర్టులే కాకుండా, న్యాయస్థానాలపై పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించేందుకు ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ప్రభుత్వం అన్వేషిస్తోంది. రాజీ మార్గాల ద్వారా వివాదాలను పరిష్కరించే లోక్ అదాలత్ ల నిర్వహణను మరింత ముమ్మరం చేయాలని, వాటిల్లో కేసుల పరిష్కారంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కేంద్రం భావిస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఈ సమగ్ర చర్యల ద్వారా సామాన్యులకు మరింత త్వరగా న్యాయం అందేలా చూస్తామని ప్రభుత్వం వెల్లడించింది.













Click it and Unblock the Notifications
