జగన్ మంత్రుల ఓటమి బాట - గెలిచేది వీరే..!!
ఏపీలో ఎగ్జిట్ పోల్స్ ఉత్కంఠ పెంచుతున్నాయి. హోరా హోరీగా సాగిన ఎన్నికల సమరం పై భిన్న అంచనాలు వెల్లడవుతున్నాయి. జగన్ అధికారంలోకి వస్తారని కొన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్స్ లో పేర్కొన్నాయి. జాతీయ మీడియా సంస్థలు ఎక్కువగా ఏపీలో కూటమికి అవకాశాలు ఉన్నాయని అంచనాలు వెల్లడించాయి. ఇక, జగన్ కేబినెట్ లోని మంత్రుల గెలుపు, ఓటముల పైన సర్వే సంస్థలు ఇచ్చిన రిపోర్ట్స్ ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారాయి.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు
ఏపీ ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన సర్వే సంస్థలు జగన్ మరోసారి అధికారం చేపడుతారని అంచనాలు వెల్లడించాయి. ప్రముఖ సర్వే సంస్థ ఆరా వెల్లడించే అంశాల పైన ఆసక్తి కనిపించింది. ఈ సంస్థ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం వైసీపీకి 94 నుంచి 104 అసెంబ్లీ సీట్లు వస్తాయి. టీడీపీ కూటమికి 71 నుంచి 81 సీట్లు వస్తాయి. వైసీపీకి 49.41శాతం, కూటమికి 47.55 శాతం ఓటు శాతం వస్తుందని ఆరా పేర్కొంది. జగన్‌కు మహిళలు జై కొట్టారని, 56 శాతం మహిళలు ఫ్యాను గుర్తుకు ఓటేశారని ఆరా పేర్కొంది. కూటమికి 43 శాతం మహిళలు మద్దతిచ్చారని తెలిపింది. ఇక పురుషుల్లో వైసీపీ కంటే కూటమికి 6 శాతం ఎక్కువగా ఓట్లు వచ్చాయని తెలిపింది.

మంత్రులు గెలుపు, ఓటమి
ఆరా సంస్థ వెల్లడించిన అంచనాల ప్రకారం సీఎం జగన్ భారీ మెజార్టీతో గెలవనున్నారు. మంత్రులు సీదిరి అప్పలరాజు, గుడివాడ అమర్నాథ్, కారుమూరి, చెల్లుబోయిన, కొట్టు సత్యనారాయణ, విడదల రజనీ, ఆదిమూలం సురేష్, ఉషశ్రీ చరణ్, ఆర్కే రోజా, స్పీకర్ తమ్మినేని ఓడిపోతారని ఈ సర్వే సంస్థ అంచనాగా వెల్లడించింది. అదే విధంగా.. మంత్రులు ధర్మాన, జోగి రమేష్, అంబటి రాంబాబు గట్టి పోటీని ఎదుర్కొంటున్నారన్నారు. ఇక మంత్రులు అప్పన్న దొర, బొత్స, పినిపె విశ్వరూప్, దాడిశెట్టి రాజా, తానేటి వనిత, మేరుగ నాగార్జున, కాకాణి, ఆంజాద్ బాషా, పెద్దిరెడ్డి గెలుస్తారని సర్వే సంస్థ పేర్కొంది. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, బాలకృష్ణ, లోకేష్ గెలుస్తారని ఆరా సంస్థ అంచనాగా పేర్కొంది.

తుది ఫలితం పై ఉత్కంఠ
ఇక ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు టెక్కలి నుంచి స్వల్ప మెజారిటీతో గెలుపొందుతారని సర్వే పేర్కొంది. గన్నవరం నుంచి వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ, ఉండి నుంచి టీడీపీ అభ్యర్థి రఘురామ కృష్ణరాజు గెలుపొందుతారని పేర్కొంది. అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన మంత్రి బూడి ముత్యాల నాయుడు ఓడిపోతారని పేర్కొంది. కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా రాదని విశ్లేషించింది. జాతీయ మీడియా సంస్థల అంచనాలు...స్థానిక సర్వే సంస్థల అంచనాలు భిన్నంగా ఉన్నాయి. అయితే, ఎవరు అధికారంలోకి వచ్చినా... భారీ మెజార్టీ సాధించే అవకాశాలు లేవని సంకేతాలు కనిపిస్తున్నాయి. దీంతో..టీడీపీ కూటమి - వైసీపీ నేతల్లో తుది ఫలితాల పైన మరింత టెన్షన్ పెరిగిపోతోంది.












Click it and Unblock the Notifications