విజయవాడలో ఘోర అగ్నిప్రమాదం.. ఆటోనగర్‌లో తగలబడిన 7 ప్రైవేట్ బస్సులు!
ఏపీలోని విజయవాడలో గల ఆటోనగర్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మరమ్మతుల కోసం ఓ గ్యారేజీలో నిలిపి ఉంచిన బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో.. క్షణాల్లోనే అవి పక్కనే ఉన్న ఇతర బస్సులకు వ్యాపించాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపగా, అక్కడ ఉన్నవారు భయాందోళనలకు గురయ్యారు. ఈ ప్రమాదంలో గ్యారేజీలో నిలిపి ఉంచిన మొత్తం ఏడు బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి. వాహనాలు పూర్తిగా కాలిపోవడంతో భారీ ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
అసలేం జరిగిందంటే..
ఆటోనగర్‌లోని ఓ ప్రైవేట్ మెకానిక్ షెడ్డులో పలు ట్రావెల్స్‌కు చెందిన బస్సులను మరమ్మతుల కోసం నిలిపి ఉంచారు. ఆదివారం మధ్యాహ్నం ఒక బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. దాంతో గ్యారేజీలోని మిగతా బస్సులకు కూడా మంటలు అంటుకున్నాయి. దాంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజిన్లతో సహాయక చర్యలు ప్రారంభించారు. గంటకు పైగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మంటలు మరింత వ్యాపించకుండా చుట్టుపక్కల ఉన్న వాహనాలను, ఇతర సామగ్రిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

అయితే అగ్నిప్రమాదం జరిగిన సమయంలో గ్యారేజీలో పెద్ద సంఖ్యలో సిబ్బంది లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కొందరు కార్మికులు మంటలు మొదలైన వెంటనే బయటకు పరుగులు తీయడంతో పెను ప్రమాదం తప్పినట్లు సమాచారం. అయితే నష్టం ఎంత మేరకు జరిగిందనే అంశంపై ఇంకా పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది. ఇక ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగాయా? లేక మరేదైనా సాంకేతిక లోపం కారణమా? అనే కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications