యూనివర్సిటీ గెస్ట్ హౌస్‌లో కొత్త జంట శోభనం... కాకినాడ జేఎన్‌టీయూలో నిర్వాకం... ఆలస్యంగా వెలుగులోకి
కాకినాడ జేఎన్‌టీయూ గెస్ట్ హౌస్ హనీమూన్ హబ్‌గా మారిపోయింది. నిబంధనలకు విరుద్దంగా గెస్ట్ హౌస్‌లోని ఓ గదిలో ఓ కొత్త జంట శోభనం తంతు జరిగింది. యూనివర్సిటీ ప్రొఫెసర్ స్వర్ణ కుమారి పేరిట గెస్ట్ హౌస్‌లో మొత్తం 3 గదులు బుక్ చేయగా.. అందులో ఒక దానిలో శోభనం ఏర్పాట్లు చేశారు. యూనివర్సిటీ గెస్ట్ హౌస్‌ను శోభనం తంతుకు ఉపయోగించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదేమైనా అత్తారిల్లా అని పలువురు విమర్శిస్తున్నారు.
ఈ నెల 18న ప్రొఫెసర్ స్వర్ణ కుమారి ఆ మూడు గదులను బుక్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో రూమ్ నం.201లో శోభనం తంతు జరిగింది. మిగతా గదుల్లో పెళ్లి వేడుకలు జరిపినట్లు సమాచారం. వర్సిటీకి చెందిన మహిళా ప్రొఫెసర్ పేరిటే గదులు బుక్ చేయడంతో.. సిబ్బంది కూడా అక్కడ ఏం జరుగుతుందో పట్టించుకోలేదని తెలుస్తోంది.
హనీమూన్ హబ్ గా మారిన కాకినాడ JNTUK గెస్ట్ హౌస్#JNTUK #oneindiatelugu pic.twitter.com/T82070X6q8
— oneindiatelugu (@oneindiatelugu) August 21, 2021
సాధారణంగా ఇతర ప్రాంతాల నుంచి యూనివర్సిటీ వ్వవహారాల నిమిత్తం ఇక్కడికి వచ్చే అధికారులు,సిబ్బందికి ఈ గదులను అద్దెకు ఇస్తుంటారు. అంతేగానీ ఇక్కడ ప్రైవేట్ కార్యకలాపాలకు తావు లేదు.ప్రైవేట్ కార్యక్రమం కోసం ఇలా యూనివర్సిటీని ఉపయోగించుకున్న ప్రొఫెసర్‌తో పాటు అందుకు అనుమతినిచ్చిన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది. వర్సిటీ విద్యార్థి,ఉద్యోగ సంఘాలు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థులు చదువుకునే యూనివర్సిటీలో ఇలాంటి ప్రైవేట్ కార్యక్రమాలు నిర్వహించడమేంటని ప్రశ్నిస్తున్నారు. మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఘటనపై యూనివర్సిటీ యాజమాన్యాన్ని వివరణ కోరగా... దీనిపై ఒక కమిటీ వేసి విచారణకు ఆదేశిస్తామన్నారు. కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. యూనివర్సిటీలో ప్రైవేట్ కార్యకలాపాలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

Recommended Video
ఇదిలా ఉంటే,కొద్ది రోజుల క్రితం కాకినాడ జేఎన్‌టీయూలో కరోనా కలకలం రేపిన సంగతి తెలిసిందే.క్యాంపస్‌లోని బాలికల హాస్టల్‌లో ఒకేసారి 15 మంది విద్యార్థినులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో హాస్టల్‌లోని మొత్తం 400 మంది విద్యార్థినులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.












Click it and Unblock the Notifications