మోడీ రోడ్ మ్యాప్ అమల్లో పెట్టేసిన బీజేపీ- వైసీపీ, టీడీపీపై ఉమ్మడి దాడి మొదలు-జీవీఎల్, సోము కామెంట్స్
ఏపీలో జనసేనకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో ఆ పార్టీతో కలిసి అధికార వైసీపీ, విపక్ష టీడీపీపై దాడి ముమ్మరం చేయాలని, 2024 ఎన్నికల వరకూ ఇదే వ్యూహం అమలు చేయాలని ప్రధాని మోడీ ఇచ్చిన సూచనను బీజేపీ నేతలు అమల్లో పెట్టేశారు.
ఇవాళ విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టిన బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు సోము వీర్రాజు, బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వైసీపీ, టీడీపీపై ఉమ్మడిగా విరుచుకుపడ్డారు.

జగనన్న కాలనీలపై సోము ఫైర్
రాష్ట్రంలో తమ మిత్రపక్షం జనసేన ఇళ్ల పధకానికి సంబంధించి సోషల్ ఆడిట్ చేసిందని, వైసీపీకి సంబంధించిన స్థానిక ఎమ్మెల్యే లు దీన్ని అడ్డుకోవడాన్ని ఖండిస్తున్నట్లు సోమువీర్రాజు తెలిపారు. వైసీపీ నేతలు ఇలాంటి ఉద్యమం చేస్తే బీజేపీ కూడా రోడ్డు మీదకు
వస్తుందని హెచ్చరించారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం 20లక్షల ఇళ్లు అర్బన్ లో,
5 లక్షల ఇళ్లు గ్రామాల్లో కేటాయించిందని సోము తెలిపారు. ఒక్కో ఇంటికి లక్షా 80 వేలు ఉచితంగా ఇచ్చామన్నారు.
నిర్మాణం కోసం కేంద్రం 35వేల కోట్లు ఏపీకి ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు. 11వేల కోట్లు ఖర్చు చేశామంటున్న ప్రభుత్వం అవినీతి జరగలేదని చెప్పలేక పోతుందని సోము విమర్శించారు. ఇళ్ల నిర్మాణం కోసం తాము 35వేల కోట్లు ఇస్తే, వైసీపీ ప్రభుత్వం
11వేల కోట్లే ఖర్చు చేసిందా అని సోము ప్రశ్నించారు. వైసీపీ సర్కార్ ఇళ్ల నిర్మాణ పథకానికి మోడీ జగనన్న కాలనీలు అని పేరు పెట్టాలి కదా అని నిలదీశారు. కేంద్రం ఇచ్చిన డబ్బుకు మీ పేర్లే ఎందుకని ప్రశ్నించారు. మిగతా ఇరవై కోట్లు కూడా ఖర్చు పెట్టి ఇళ్ల
నిర్మాణం పూర్తి చేయాలన్నారు.

పవన్ ను అడ్డుకుంటే సహించమన్న సోము
పవన్ కళ్యాణ్ కార్యక్రమాల్ని అడ్డుకుంటే సహించబోమని సోము వీర్రాజు ఇవాళ వైసీపీ సర్కార్ ను హెచ్చరించారు.
ఆయనపై అసభ్య పదజాలం వాడటం సరికాదన్నారు. మీడియాను అడ్డుపెట్టుకుని వైసీపీ సర్కార్ రాజకీయాలు చేస్తోందని సోము మండిపడ్డారు. తమకు ఎలాగూ కవరేజి ఇవ్వరని, మిత్ర పక్షం జనసేన కవరేజి కూడా తగ్గించేశారన్నారు. మీడియాను మీ చేతుల్లో
పెట్టుకుని ప్రచారం కల్పించరా అని ప్రశ్నించారు. వైసీపీ, టీడీపీ మిలాఖత్ అయ్యి రాజకీయం చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో చర్చిలకు 175కోట్లు ఇవ్వాలన్న వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా సోము వీర్రాజు తప్పుబట్టారు. ప్రభుత్వ సొమ్ము చర్చిలకు ఎలా
ఇస్తారని ప్రశ్నించారు. వైసీపీ మతతత్వ పార్టీ అని, మతాలతో రాజకీయం చేస్తుందన్నారు. ఈ ప్రభుత్వం బరి తెగించి వ్యవహరిస్తుందని సోము మండిపడ్డారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టులో న్యాయ పోరాటం చేస్తామన్నారు.

గన్నవరం ఎయిర్ పోర్టులో లోకల్ పోలీసులా ?
గన్నవరం విమానాశ్రయం లో స్థానిక పోలీసులు తో రక్షణ ఎందుకని బీజేపీ ఎంపీ జీవీఎల్ ప్రశ్నించారు. టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల హయాంలో దీనిపై అనేక ఆరోపణలు వచ్చాయన్నారు. దీనిపై కేంద్ర విమానయానశాఖ మంత్రి కి లేఖ రాశానన్నారు. ఎయిర్
పోర్టులో సీఐఎస్ఎఫ్ బలగాలు ఎందుకు లేవని జీవీఎల్ ప్రశ్నించారు. రాష్ట్రంలో రెండు వేల నోట్లు ఎందుకు కనిపించకుండా పోయాయని కూడా అడిగారు. దీనిపై ఆర్బీఐ విచారణ కోరతామన్నారు.
జగన్ ప్రభుత్వం వైఫల్యంపై ఛార్జిషీట్ ప్రకటిస్తామని జీవీఎల్ వెల్లడించారు.

మోడీ టూర్ తో పరిస్దితి మారిందన్న జీవీఎల్
మోడీ విశాఖ పర్యటన తరువాత ప్రజల్లో మార్పు కనిపిస్తుందని జీవీఎల్ తెలిపారు. జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ట్విట్టర్ ద్వారా ఇదే చెప్పారన్నారు. 2024లో ఏపీలో మోడీ మ్యాజిక్ పని చేస్తుందన్నారు. బిజెపి,జనసేన భాగస్వామ్యంతో అధికారంలోకి
వస్తామన్నారు. పొలిటికల్ బ్లాక్ బస్టర్ 2024లో రావడం ఖాయమన్నారు. టీడీపీ
పూర్తి అభద్రతా భావంతో ఉందన్నారు. వారిలో నాయకత్వం క్షీణిస్తుందని అందరూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారన్నారు. నిరాశపరచిన గతం టీడీపీదని, భరించలేని వర్తమానం వైసీపీదన్నారు. అందరూ ఎదురు చూసే భవిష్యత్తు బీజేపీ-జనసేనదని జీవీఎల్
తెలిపారు. వైసీపీ, టీడీపీ కుట్రపార్టీలన్నారు. నిజమైన ప్రత్యామ్నాయం ఒక్క బిజెపి తోనే సాధ్యమన్నారు. రాష్ట్రం లో కాపులకు, బిసిలకు, ఎస్సీ,ఎస్టీలకు న్యాయం జరగడం లేదని,
అన్ని వర్గాల వారికి న్యాయం చేయడం బిజెపి, జనసేన కూటమికే సాధ్యమని జీవీఎల్ తెలిపారు. అన్ని వర్గాల వారికి సముచిత స్థానం కల్పించే కార్యాచరణ సిద్దంగా ఉందన్నారు. యనమల వంటి వారికే సీటు లేదని చంద్రబాబు అంటున్నారని, వైసిపి లో కేవలం
ఒక వర్గానికే పదవులు మొత్తం సొంతమన్నారు. వైసిపి కాదు బీజేపీ, జనసేనతోనే రాష్ట్ర భవిష్యత్తు అన్నారు.












Click it and Unblock the Notifications