గెలిచిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ- ఆయన సూచనలే..ఇప్పుడు సుప్రీం ఆదేశాలు..!!
కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామకాల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ స్వాగతించారు. ఇలాంటి సంస్కరణలు అవసరమని తాను ఇదివరకే సూచించానని అన్నారు.
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామకాల విషయంలో ఇవ్వాళ దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పును ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న నియామకాల ప్రక్రియను తప్పుపట్టింది. దీన్ని రద్దు చేసింది. ఈ నియామకాల్లో సంస్కరణలకు తెర తీసింది సుప్రీంకోర్టు. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఎన్నికల కమిషనర్ల నియామకాలను చేపట్టడం సరికాదని అభిప్రాయపడింది. అదే సమయంలో కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది.

అత్యున్నత కమిటీ..
కేంద్ర ఎన్నికల కమిషనర్లను నియమించడానికి ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ఆదేశించింది. ఈ కమిటీలో ప్రధానమంత్రి, లోక్ సభలో ప్రతిపక్ష నేత లేదా అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ నాయకుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సభ్యులుగా ఉంటారని తెలిపింది. ఎన్నికల కమిషనర్లుగా ఎవరిని నియమించాల్సి ఉంటుందనేది ఈ కమిటీ నిర్ణయిస్తుందని స్పష్టం చేసింది.

కొలీజియం తరహా
దేశవ్యాప్తంగా వివిధ న్యాయస్థానాల్లో న్యాయమూర్తులకు పదోన్నతులు, బదిలీలను నిర్ణయించడానికి సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థ ఎలా పని చేస్తుందో.. అదే తరహాలో ఎన్నికల కమిషనర్లను నియమించడానికి కూడా ఓ వ్యవస్థ ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఈ ముగ్గురు సభ్యుల కమిటీకి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్ లో చట్టాన్ని ఆమోదించాలని కూడా సుప్రీంకోర్టు- కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

అయిదు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం..
కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించి.. దాఖలైన పిటీషన్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్ సారథ్యంలోని అయిదుమంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇవ్వాళ ఆదేశాలను వెలువడించింది. ఈ రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ కేఎం జోసెఫ్ తో పాటు జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ హృషికేష్ రాయ్, జస్టిస్ సీటీ రవికుమార్ ఉన్నారు.

ఆయన నియామకంపై..
ఈ ముగ్గురు సభ్యుల కమిటీ సిఫారసు చేసిన వారిని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ గా, ఎన్నికల కమిషనర్లుగా రాష్ట్రపతి నియమించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. రిటైర్డ్ ఐఎఎస్ అధికారి అరుణ్ గోయెల్ ను కేంద్ర ప్రభుత్వం మెరుపువేగంతో 24 గంటల్లోనే ఎన్నికల కమిషనర్ గా నియమించడాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నిచింది. ఆయన నియామకం విషయంలో అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ కేంద్రం వాటికి ప్రాధాన్యత ఇవ్వలేదని వ్యాఖ్యానించింది.

స్వాగతించిన జేడీ..
కాగా- సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాలపై సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ స్పందించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో సమూలంగా సంస్కరణలకు సుప్రీంకోర్టు శ్రీకారం చుట్టిందని అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

అప్పుడే సూచించా..
ఎన్నికల ప్రక్రియలో కీలకమైన సంస్కరణలను చేపట్టాల్సి ఉంటుందని తాను ఇదివరకే సూచించానని లక్ష్మీనారాయణ అన్నారు. అందులో ఒకటి- ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన కమిటీ.. ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేయాల్సి ఉంటుందని గతంలో సూచించానని అన్నారు. ఈ మేరకు.. గత ఏడాది నవంబర్ 18వ తేదీన తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసిన ట్వీట్ స్క్రీన్ షాట్ ను ఆయన తాజాగా షేర్ చేశారు.












Click it and Unblock the Notifications