వివేకా హత్య వెనుక ఏబీ వెంకటేశ్వర రావు- ఆ ముగ్గురు: బాంబు పేల్చిన కొడాలి నాని
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో చంద్రబాబు, నారా లోకేష్ పై సీబీఐతో విచారణ జరిపించాలని మాజీ మంత్రి కొడాలి నాని డిమాండ్ చేశారు. చంద్రబాబు, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావు సారథ్యంలో ఈ హత్య జరిగిందని
అమరావతి: మాజీ మంత్రి వివేకానందరెడ్డిని హత్య చేసిన కేసులో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ పై సీబీఐ విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. ఒకప్పటి టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి ఆది నారాయణ రెడ్డి, పులివెందులకు చెందిన బీటెక్ రవి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ లపై సీబీఐతో విచారణ జరిపించితే- వివేకానందరెడ్డి హత్యకేసులో అసలు నిందితులు బయటపడతారని చెప్పారు.

చంద్రబాబు, ఏబీ పాత్ర..
వివేకానందరెడ్డి హత్యకేసు సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నాడని, ఏబీ వెంకటేశ్వర రావు ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ గా పని చేశాడని కొడాలి నాని గుర్తు చేశారు. చంద్రబాబు, ఏబీ వెంకటేశ్వర రావును సీబీఐ విచారించాలని డిమాండ్ చేశారు. వివేకానందరెడ్డిని తానే హత్య చేయించానంటూ చంద్రబాబు జగ్గంపేట రోడ్ షోలో అంగీకరించాడనే విషయాన్ని ఈ సందర్భంగా కొడాలి నాని గుర్తు చేశారు. తన మనసులో మాటను చంద్రబాబు బయటపెట్టాడని చెప్పారు.

సాక్ష్యాధారాలు ఉంటే సీబీఐకి ఇవ్వాలి..
వివేకానందరెడ్డి హత్యోదంతంపై ప్రస్తుతం సీబీఐ విచారణ జరుపుతోందని, చంద్రబాబు లేదా ఆయన అనుకూల మీడియా, టీడీపీ నాయకుల వద్ద ఉండే ఆధారాలు ఏవైనా ఉంటే అధికారులకు ఇవ్వాలని సవాల్ విసిరారు. చంద్రబాబు నిజంగా మగాడే అయితే- 2014 నుంచి పోలవరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి గురించి విచారణ జరిపించాలని సీబీఐకి లేఖ రాయాలని కొడాలి నాని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబకు ఏటీఎంలా మారిందంటూ స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే చెప్పారని పేర్కొన్నారు.

మాకు కొత్తేమీ కాదు..
సీబీఐ విచారణలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గానీ, తనకు గానీ కొత్తేమీ కాదని కొడాలి నాని అన్నారు. జగన్ సీబీఐ విచారణను ధైర్యంగా ఎదుర్కొన్నారని చెప్పారు. సోనియా గాంధీ, చంద్రబాబు కుట్ర పన్ని 16 నెలలు ఆయనను జైలుపాలు చేసినా ఏ ఒక్కరికీ తలవంచలేదని అన్నారు. పరిటాల రవి హత్యోదంతం విషయంలో తనపై సీబీఐతో విచారణ వేయించుకున్న మగాడు జగన్ అని కొడాలి నాని పేర్కొన్నారు. తనపై ఉన్న కేసులన్నింటికీ స్టే తెచ్చుకన్న పిరికివాడు చంద్రబాబు అని ధ్వజమెత్తారు.

చంద్రబాబు-కరవు ట్విన్స్..
14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు హయాంలో ఎప్పుడైనా, ఏ ఒక్క ప్రాజెక్టయినా నిండిందా? అని కొడాలి నాని ప్రశ్నించారు. చంద్రబాబు పుట్టుకతోనే దరిద్రుడని, అది అతనితో పాటు పెరిగి పెద్దదైందని ఎద్దేవా చేశారు. కరవు కాటకాలు-చంద్రబాబు కవల పిల్లలని కొడాలి నాని చురకలు అంటించారు. ఏ ఒక్క భారీ ప్రాజెక్ట్ అయినా వరద నీటితో కళకళలాడలేదని, ఇంకుడు గుంతలతో కాలయాపన చేశాడని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications