సీఎం సొంత జిల్లాలో మహిళలకు రక్షణ లేదా..?
సీఎం చంద్రబాబు సొంత జిల్లాలోనే మహిళలకు రక్షణ లేదని వైసీపీ మాజీ మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో ఏడేళ్ల పాపను కిడ్నాప్ చేసి కిరాతకంగా హత్య చేసిన ఉదంతంపై మాజీ మంత్రి రోజా స్పందించారు. పుంగనూరు బాలిక కిడ్నాప్, హత్య పై మాజీ మంత్రి రోజా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గత నెల 29 న అదృశ్యమైన పాప నాలుగు రోజుల తర్వాత శవమై కనిపించింది. ఇంటికి నాలుగు కిలోమీటర్ల దూరంలోనే బాలిక శవమై కనిపించింది.
ఈ ఘటనపై రియాక్ట్ అయిన రోజా..పాప ఆ ఇంటి సమీప ప్రాంతాల్లోనే ఉన్నా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా గుర్తించలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం సొంత చిత్తూరు జిల్లాలో ఏడేళ్ల పాపను కిడ్నాప్ చేసి కిరాతకంగా హత్య చేసిన ఉదంతం గుండెను పిండేస్తోందంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అసమర్ధతపై రోజా నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే రక్షణ లేకపోతే ప్రభుత్వ అసమర్ధత కాదా? అంటూ కూటమి ప్రభుత్వాన్ని రోజా ప్రశ్నించారు. కూటమి పాలనలో మహిళలకు ,ముఖ్యంగా యువతలకు రక్షణ లేకుండాపోయిందని ఆమె వ్యాఖ్యానించారు.

ఆడపిల్లలు ఉన్న తల్లితండ్రులు పిల్లలను స్కూల్‌కి పంపాలంటే భయమేస్తోందని రోజా తెలిపారు. ముచ్చుమర్రి ఘటనలోనూ బాధితులకు న్యాయం చేయని ప్రభుత్వం ఆవసరమా అంటూ చంద్రబాబు సర్కార్‌ను నిలదీశారు. మంత్రి లోకేష్ నియోజకవర్గంలో 24 గంటల్లో ముగ్గురు మహిళలపై అత్యాచారాలు జరిగాయంటే కూటమి పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చంటూ ఎద్దెవా చేశారామె. హోంమంత్రి పక్క నియోజకవర్గంలో రాంబిల్లిలో ఒక యువతి కాపాడమని కోరినా పట్టించుకోలేదని, జైలు నుంచి వచ్చి నిందితుడు ఆ యువతిని దారుణంగా హత్య చేశాడని రోజా గుర్తు చేశారు.
మదనపల్లి ఫైల్స్‌పై పెట్టిన శ్రద్ధ మహిళల రక్షణ మీద కూడా పెడితే బాగుండేదని, మదనపల్లి ఫైల్స్ కోసం ప్రత్యేక హెలికాప్టర్‌ను పంపిన ప్రభుత్వం ఫైల్స్‌కి ఇచ్చిన విలువ ఆడబిడ్డలకు ఇవ్వడం లేదంటూ చంద్రబాబు తీరుపై విమర్శలు గుప్పించారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? పోలీసులు ఉన్నారా? అంటూ రోజా ప్రశ్నించారు. పోలీసులను రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి, తప్పుడు కేసులు పెట్టడానికి ఉపయోగిస్తున్నారని రోజా అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా కక్ష సాధింపుతో దిశ చట్టాన్ని, మహిళా పోలీసులను నిర్వీర్యం చేయకుండా బలోపేతం చేయండంటూ ప్రభుత్వానికి రోజా విజ్క్షప్తి చేశారు. మిమ్మల్ని కన్న తల్లి కూడా ఆడదే అని గుర్తు తెచ్చుకుని మహిళా రక్షణను పెంచి.. తక్షణమే పుంగనూరు ఘటన నిందితులను అరెస్టు చేయాలని రోజా డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications