కొమ్మినేని అరెస్ట్..టార్గెట్ ఫిక్స్ అంటూ వైసీపీ ఫైర్ బ్రాండ్ ఘాటు వ్యాఖ్యలు
ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి రోజా తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియాను అణచివేసే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆమె మండిపడ్డారు.
ఈ అరెస్ట్ పత్రికా స్వేచ్ఛకు, భావ ప్రకటనా స్వేచ్ఛకు విఘాతం కలిగించడమేనని రోజా ఆరోపించారు. కొమ్మినేని శ్రీనివాసరావు సుదీర్ఘ కాలంగా జర్నలిజంలో తనదైన ముద్ర వేసుకున్న వ్యక్తి అని, ఆయన నిజాలను నిర్భయంగా చెప్పే గొంతుక అని ఆమె ప్రశంసించారు.

ప్రభుత్వాలు తప్పు చేస్తే ప్రశ్నించే హక్కు మీడియాకు ఉంటుంది. జర్నలిస్టులను అరెస్ట్ చేసి భయపెట్టాలని చూస్తే అది కుదరదు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని రోజా తీవ్ర స్వరంతో అన్నారు. తక్షణమే కొమ్మినేని శ్రీనివాసరావును విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ అరెస్టు వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆమె కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
అనంతపురంలో గిరిజన విద్యార్థిని తన్మయ్ పై దుండగులు అత్యాచారం చేసి హత్యచేశారని గుర్తు చేసిన రోజా..హోంమంత్రి అనిత ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వంలో మహిళలకు భద్రత కరువైందని విమర్శించిన రోజా.. త్వరలోనే ప్రజలు బుద్ది చెప్తారని అన్నారు. మహిళలంటే ఎంతో గౌరవం అని చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. గిరిజన విద్యార్థిని పై హత్యాచారం జరిగితే ఏమైపోయారని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో జరిగే ఘటనల నుంచి డైవర్ట్ చేసేందుకే కొమ్మినేని అరెస్టు చేసిందని రోజా మండిపడ్డారు.
ఈ రోజు మీరు చేసింది.. రేపు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చేసి చూపిస్తామని ఆమె ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వంలో అన్ని విధాలుగా ఫెయిల్ అయిందని, అందుకే ఇలా డైవర్షన్ పొలిటికల్స్‌కు తెర లేపారని రోజా విమర్శించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని, ఇప్పటికైనా చేసిన తప్పులను గ్రహించి, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని రోజా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications