జగన్ కంచుకోటలో టీడీపీ జెండా పాతడం ఖాయమంటున్న గంటా, సీఎం
హైదరాబాద్: ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా ఇప్పటికే వైసీపీని చాలావరకు దెబ్బకొట్టిన టీడీపీ.. జగన్ సొంత ఇలాఖాలో సైతం వైసీపీని కోలుకోలేని దెబ్బతీయాలని చూస్తోంది. అయితే ఇదంతా సులువుగా సాధ్యమయ్యే పనికాదు. ఎన్నెన్ని వ్యూహాలతో జగన్ పై అస్త్రాలు ఎక్కుపెట్టే ప్రయత్నం చేసినా.. జగన్ కంచుకోటలో టీడీపీ నిలదిక్కుకోవడమనేది అనితర సాధ్యమనే చెప్పాలి.
ప్రస్తుతం కడప జిల్లా టీడీపీ ఇంచార్జీగా వ్యవహరిస్తున్న గంటా శ్రీనివాసరావు.. జిల్లాలో టీడీపీ బలోపేతం కోసం చాన్నాళ్లుగానే శ్రమిస్తున్నా.. ఫలితం మాత్రం ఎక్కడా కనిపించినా దాఖలా లేదు. ఈ విషయంలో టీడీపీ ప్రకటనలన్ని వార్తలకే పరిమితమవుతూ వస్తున్నాయి తప్పితే.. ఆచరణలో జగన్ ను ఎదుర్కోవడం టీడీపీకి సాధ్యపడలేదు.
అయితే రాబోయే రోజుల్లో.. గత చరిత్రకు ఫుల్ స్టాప్ పెడుతూ జగన్ కంచుకోటలో టీడీపీ పాగా వేసేలా చేసేందుకు.. మంత్రి గంటాతో పాటు టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ తీవ్రంగానే కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా దీనిపై స్పందిస్తూ.. జగన్ సొంత జిల్లాలో మా సత్తా ఏంటో చూపిస్తామంటూ ఈ ఇద్దరూ నేతలు ప్రకటించారు. కడప ప్రజలకు చేరువయ్యేందుకు అన్నివిధాలాకృషిచేస్తున్నామని తెలిపారు.
కడప జిల్లా వ్యవహారాన్ని టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, వచ్చే ఎన్నికల్లో కడపలో అన్ని స్థానాలు టీడీపీవే అని ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో జిల్లాలో ఒక్క స్థానానికే పరిమితమైన టీడీపీ వచ్చే ఎన్నికల నాటికి జిల్లా మొత్తంలో పట్టు సాధించేది అనుమానమే. అయితే గంటా, సీఎం రమేశ్ మాత్రం చేసి చూపిస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు కాబట్టి.. మరి 2019 ఎన్నికల్లో వీరి పనితనం ఎంతమేర ఫలిస్తుందో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications